హామీల అమలులో విఫలం… దృష్టి మళ్లింపే కేసీఆర్‌కు నోటీసులు

 హామీల అమలులో విఫలం… 

దృష్టి మళ్లింపే కేసీఆర్‌కు నోటీసులు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల లబ్ధికే కాంగ్రెస్ కుట్రలు 

సిల్వేరి సాంబశివ విమర్శ

మహేశ్వరం, జనవరి 29 (మనఊరు ప్రతినిధి): మహేశ్వరం నియోజకవర్గంలో సోషల్ మీడియా కన్వీనర్ సిల్వేరి సాంబశివ ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోతుందని విమర్శించారు. పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాల్లో భాగంగానే, రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారికి నోటీసులు జారీ చేశారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టిన మహానాయకుడు కేసీఆర్ గారని, పదేళ్ల పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి తెలంగాణకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారని పేర్కొన్నారు. అలాంటి నాయకుడిపై నోటీసులు ఇవ్వడం రాజకీయ దురుద్దేశంతో చేసిన హాస్యాస్పద చర్య అని అన్నారు. ఈ సందర్భంగా మాజీ డీజీపీ సజనార్ను ఉద్దేశించి సిల్వేరి సాంబశివ ఘాటుగా స్పందించారు. మీ గుండె మీద చేయి వేసుకుని చెప్పండి… ఇది ఎంతవరకు న్యాయం? ఇది నిజమా? అవాస్తవమా? నిజం మీ గుండెలో మీకే తెలుసు. పాలకుల ఒత్తిడికి లోనై నోటీసులు జారీ చేయడం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడమే అని వ్యాఖ్యానించారు. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గట్టి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. భవిష్యత్తులో మళ్లీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని ధీమా వ్యక్తం చేశారు. అప్పటివరకు ఈ కుట్రలకు పాల్పడిన వారందరి ముసుగులు తప్పక తొలగిపోతాయని స్పష్టం చేశారు.

Previous Post Next Post