ఆటో బోల్తా బాలుడు మృతి
రోడ్డు ప్రమాదంలో తలకొండపల్లి వద్ద విషాదం
తలకొండపల్లి, జనవరి 29 (మనఊరు ప్రతినిధి): రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల పరిధిలోని వెల్జాల్ గ్రామపంచాయతీ పరిధిలో గురువారం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మిడ్జిల్ నుంచి మాదాయపల్లి వైపు వేగంగా వెళ్తున్న ఆటో ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఓ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన బాలుడు మాదాయపల్లి గ్రామానికి చెందినవాడిగా స్థానికులు గుర్తించారు. ఘటన విషయం తెలిసిన వెంటనే స్థానికులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సంఘటనతో మాదాయపల్లి, వెల్జాల్ గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
