జేపీ దర్గా ఉర్సులో పోలీసు బందోబస్తుకు ఎమ్మెల్యే ప్రశంసలు
తోపులాట లేకుండా గంధోత్సవం విజయవంతం : డీసీపీ సిహెచ్ శిరీషకు ప్రత్యేక అభినందనలు
కల్వకుర్తి, జనవరి 16 (మనఊరు ప్రతినిధి): ప్రతి ఏటా హజరత్ జహంగీర్ పీర్ దర్గా క్షేత్రంలో ఉర్సు ఉత్సవాల సందర్భంగా పోలీసు బందోబస్తు, రాకపోకల నియంత్రణ అంశాల్లో ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అయితే ఈ ఏడాది జేపీ దర్గా ప్రాంగణంలో నిర్వహించిన ఉర్సు గంధోత్సవం సందర్భంగా పోలీసు శాఖ ఏర్పాటు చేసిన బందోబస్తు తీరుపై స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రశంసించడం విశేషంగా మారింది. గురువారం సాయంత్రం హజరత్ జహంగీర్ పీర్ దర్గా పుణ్యక్షేత్రంలో జరిగిన ఉర్సు గంధోత్సవంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌తో పాటు వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మత్తుల్లా, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రతియేటా గంధోత్సవం సందర్భంగా వీఐపీలు, ప్రజాప్రతినిధుల రాకతో పోలీసు శాఖ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ తోపులాట తప్పని పరిస్థితి ఉండేది. అయితే ఈసారి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా బాధ్యతలు చేపట్టిన సిహెచ్ శిరీష సమర్ధవంతమైన బందోబస్తు చర్యలు చేపట్టడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. కార్యక్రమం అనంతరం దర్గా నుంచి బయటకు వస్తున్న సమయంలో ఎమ్మెల్యేకు డీసీపీ సిహెచ్ శిరీష ఎదురవ్వగా, “థాంక్యూ మేడం… చాలా బాగా బందోబస్తు ఏర్పాటు చేశారు” అంటూ ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. గతంలో ఎదురైన ఇబ్బందులను గుర్తు చేస్తూ, ఈ ఏడాది ఏర్పాట్లు అత్యంత సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈసారి కంటే వచ్చే ఏడాది మరింత మెరుగైన ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే డీసీపీకి సూచించారు.
