జర్నలిస్టుల అక్రమ అరెస్టులు బాధాకరం

 జర్నలిస్టుల అక్రమ అరెస్టులు బాధాకరం

పత్రికా స్వేచ్ఛపై ప్రమాదకర దాడి 

 నాగర్ కర్నూల్ జిల్లా జర్నలిస్ట్ సంఘం నాయకుడు యూసుఫ్ బాబా ఆగ్రహం

కల్వకుర్తి, జనవరి 15 (మనఊరు ప్రతినిధి): హైదరాబాద్‌లోని ఎన్టీవీ కేంద్ర కార్యాలయంలో పనిచేస్తున్న జర్నలిస్టులను అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేయడం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసిందని నాగర్ కర్నూల్ జిల్లా జర్నలిస్టు సంఘం నాయకుడు మొహమ్మద్ యూసుఫ్ బాబా ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగ వేళలో జర్నలిస్టుల ఇళ్లకు వెళ్లి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, చట్టపరమైన విధి విధానాలు పాటించకుండానే పోలీసులు అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పుగా మారిందన్నారు. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు ప్రభుత్వానికి–ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తూ ప్రశ్నించే పాత్ర పోషిస్తారని, అలాంటి జర్నలిస్టులను అర్ధరాత్రి వేళల్లో అరెస్ట్ చేయడం పత్రికా స్వేచ్ఛపై జరిగిన ప్రత్యక్ష, ప్రమాదకర దాడిగా అభివర్ణించారు. మీడియా కార్యాలయాల్లో పోలీసులు సోదాలు నిర్వహించడం, జర్నలిస్టుల పట్ల అనుచితంగా వ్యవహరించడం తీవ్రంగా ఖండనీయమన్నారు. ఈ తరహా చర్యలు ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అక్రమంగా అరెస్ట్ చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని, పత్రికా స్వేచ్ఛను కాపాడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని యూసుఫ్ బాబా డిమాండ్ చేశారు.

Previous Post Next Post