ఆంజనేయ స్వామి ఆలయానికి రూ.లక్ష విరాళం
ఉరుకొండ, జనవరి, 18 (మనఊరు ప్రతినిధి): దైవచింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఇప్పపహాడ్ గ్రామ సర్పంచ్ బెక్కెర సునీత రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఊర్కొండపేటలోని శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆమె స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కోసం ఆమె రూ.లక్ష విరాళాన్ని ఆలయ కమిటీకి అందజేశారు.
దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా మాత్రమే కాకుండా సమాజానికి శాంతి, సద్బుద్ధిని ప్రసాదించే స్థలాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ దేవాలయాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని ఆమె కోరారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.


