వట్టెం దేవాలయంలో వైభవంగా గోదాదేవి కళ్యాణం
ధనుర్మాస ప్రత్యేక పూజల్లో వందలాది భక్తులు పాల్గొన్నారు
బిజినపల్లి, జనవరి 14 (మనఊరు ప్రతినిధి జిల్లా): నాగర్‌కర్నూల్ బిజినపల్లి మండల పరిధిలోని వట్టెం దేవాలయంలో ధనుర్మాస ప్రత్యేక పూజల కార్యక్రమంలో భాగంగా గోదాదేవి కళ్యాణం బుధవారం వేదమూర్తులైన బ్రాహ్మణులచే శాస్త్రోక్తంగా, వైభవంగా జరిగింది. దేవస్థాన ప్రధాన అర్చకులు ప్రసాదాచార్యులు, నవీన్ స్వామి, నరసింహా చార్యులు, తివారిల ఆధ్వర్యంలో వేదమూర్తులచే వేదమంత్రోచ్ఛారణల మధ్య కళ్యాణం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విశ్వక్సేన ఆరాధన, వాసుదేవ పుణ్యావచనం, మధుపర్కం, మంగళాష్టకాలు, కన్యాదానం, జిలకర–బెల్లం, మహాసంకల్ప పఠనం, మాంగల్య ధారణ, తలంబ్రాలు, వేదాలు ఆశీర్వచనం వంటి సంప్రదాయ కార్యక్రమాలు జరిగాయి. గోదా రంగనాయక స్వామివార్లకు సమర్పించిన తలంబ్రాలను అనంతరం భక్తులకు పంపిణీ చేశారు. కళ్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులను చిన్నారి సాన్విసింగ్ నృత్య ప్రదర్శన ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు దంపతులు, పార్టీ అధికార ప్రతినిధి దిలీపాచారి, రాష్ట్ర సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేందర్ గౌడ్, ఆలయ వ్యవస్థాపక సభ్యులు ప్రతాప్ రెడ్డి, సురేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ అధికారి దేవేందర్ రెడ్డి, వికాస తరంగిణి ఉమ్మడి జిల్లా సమన్వయకర్త బండారు రాజశేఖర్, బీజేపీ జిల్లా మహిళా నేత చంద్రకళ, సర్పంచ్ జ్యోతి, జక్ పాల్ రెడ్డి, చంద్రా రెడ్డితో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వందలాది మంది భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో ఉన్నారు. అనంతరం దేవస్థాన అన్నప్రసాద ట్రస్టు ఆధ్వర్యంలో నిత్య భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది.
