సంక్రాంతి కానుకగా పారిశుద్ధ్య సిబ్బందికి నూతన వస్త్రాలు పంపిణీ
కోనేరు ట్రస్టు సేవా భావనకు అభినందనలు
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 5 (మనఊరు ప్రతినిధి): సంక్రాంతి పండుగను పురస్కరించుకొని శ్రీనగర్ గ్రామపంచాయతీ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి కోనేరు ట్రస్టు ఆధ్వర్యంలో నూతన వస్త్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోనేరు ట్రస్టు నిర్వాహకుడు కోనేరు పూర్ణచంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొని పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కోనేరు పూర్ణచంద్రరావు మాట్లాడుతూ గ్రామ పరిశుభ్రత కోసం నిత్యం అహర్నిశలు కృషి చేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది సేవలు ఎంతో విలువైనవని కొనియాడారు. పండుగ వాతావరణంలో వారికి ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా కోనేరు ట్రస్టు ఆధ్వర్యంలో ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ప్రజాప్రతినిధులు, ట్రస్టు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. తమ సేవలను గుర్తించి నూతన వస్త్రాలు అందించినందుకు పారిశుద్ధ్య సిబ్బంది కోనేరు ట్రస్టుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
