పొట్టకూటి కోసం వలస…
చిన్నారి ప్రమాదం కుటుంబాన్ని కుదిపేసింది
ఐదేళ్ల జాను చికిత్సకు దాతల సాయం కోసం ఎదురుచూపు
అశ్వరావుపేట, జనవరి 5 (మన ఊరు న్యూస్): పొట్టకూటి కోసం వలస వెళ్లిన ఓ నిరుపేద కుటుంబానికి అనుకోని విషాదం ఎదురైంది. ఉన్న ఊరిలో ఉపాధి అవకాశాలు లేక, కుటుంబ పోషణ భారంగా మారడంతో వ్యవసాయ పనుల కోసం వేరే ప్రాంతానికి వెళ్లిన సమయంలో జరిగిన ప్రమాదం ఆ కుటుంబాన్ని తీవ్ర కష్టాల్లోకి నెట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం నందిపాడు గ్రామానికి చెందిన డేరంగుల ప్రసాద్ తన కుటుంబంతో కలిసి చీపురుగూడెంకు వ్యవసాయ పనుల నిమిత్తం శుక్రవారం సాయంత్రం వెళ్లారు. ఈ క్రమంలో వారి ఐదేళ్ల కుమార్తె జాను అనుకోకుండా వేడివేడి నీళ్లలో పడటంతో శరీరంపై తీవ్ర గాయాలు అయ్యాయి. తక్షణమే చిన్నారిని కొత్తగూడెం ఆసుపత్రికి తరలించగా, అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఇప్పటికే ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న ఆ కుటుంబానికి ఇప్పుడు ఆసుపత్రి ఖర్చులు భారంగా మారాయి. పూట గడవడమే కష్టంగా మారిన పరిస్థితిలో, చిన్నారి చికిత్సకు కావాల్సిన డబ్బులు లేక తల్లిదండ్రులు సతమతమవుతున్నారు. తమ పాప ప్రాణాలు కాపాడేందుకు దయగల హృదయం కలిగిన దాతలు ముందుకు వచ్చి సాయం చేయాలని బాధిత కుటుంబం కన్నీటి విజ్ఞప్తి చేస్తోంది. ఆర్థిక సహాయం చేయదలచిన వారు గొంది అలివేణి 9398227663 నంబర్‌కు సాయం పంపించాలని కోరుతున్నారు.
