బడ్జెట్ కేటాయింపులు కాగితాలకే పరిమితం
బీసీల సంక్షేమంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షులు కృష్ణ యాదవ్
జడ్చర్ల, జనవరి 8 (మనఊరు ప్రతినిధి): బడ్జెట్ కేటాయింపులు కాగితాలకే పరిమితమైందని బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షులు బూర్గుపల్లి కృష్ణ యాదవ్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. గురువారం మండల విద్యా వనరుల కేంద్రం ఆవరణలో నిర్వహించిన బీసీ జాగృతి సేన నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వార్షిక సంవత్సరంలో బీసీలకు ₹11,405 కోట్ల బడ్జెట్ కేటాయించామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ, వాస్తవంగా ₹2,426 కోట్లను మాత్రమే ఖర్చు చేయడం బీసీల అభివృద్ధిపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. వార్షిక బడ్జెట్ కాల పరిమితి ముగింపు దశకు చేరుకున్నా కేటాయించిన నిధుల్లో 25 శాతం కూడా వినియోగించకపోవడం దురదృష్టకరమని మండిపడ్డారు. ప్రతి ఏడాది బడ్జెట్‌లో అంకెల లగారడీ, ఆర్భాటాలు తప్ప బీసీలకు ఒరిగింది ఏమీ లేదని విమర్శించారు. ముఖ్యంగా బీసీ విద్యార్థుల ఉపకార వేతనాలు, బకాయి ఫీజు రియంబర్స్‌మెంట్ నిధులు, బీసీ సంక్షేమ హాస్టళ్ల అభివృద్ధి, బీసీ గురుకులాలకు స్వంత భవనాల నిర్మాణం కోసం మిగిలిన బడ్జెట్‌ను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీసీ జాగృతి సేన మండల అధ్యక్షులు గొడుగు నర్సిములు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గోపాల్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గోపాల్, నియోజకవర్గ కార్యదర్శి రామస్వామి, మండల కార్యదర్శులు సురభి రఘు, చెన్నయ్య, శివశంకర్, కావలి రమేష్ రామ్, అంజి తదితరులు పాల్గొన్నారు.
