కల్వకుర్తికి జిల్లా హోదా ఇవ్వాలి…
కల్వకుర్తి (మనఊరు ప్రతినిధి): చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా… గతం ఎంత ఘన కీర్తి కలవాడా… అన్న నినాదానికి అచ్చుగుద్దినట్లుగా 1952లో ఏర్పడిన కల్వకుర్తి నియోజకవర్గం చరిత్ర అద్భుతమని, అద్వితీయమని స్థానికులు పేర్కొన్నారు. ఎన్నో జిల్లా, రాష్ట్ర, కేంద్రస్థాయి నాయకులను తయారు చేసిన ఘనత కల్వకుర్తి ప్రాంతానిదేనని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశం చర్చకు వచ్చిన నేపథ్యంలో కల్వకుర్తి ఎందుకు జిల్లా కాకూడదు? ముమ్మాటికి జిల్లా కావాలి అనే నినాదాన్ని ప్రజలు గట్టిగా వినిపిస్తున్నారు. జిల్లా ఏర్పాటుకు కావాల్సిన అర్హతలు, వనరులు, భౌగోళిక అనుకూలతలు, ప్రభుత్వ స్థలాలు కల్వకుర్తిలో పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు. దేవరకొండ, నల్గొండ, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, ఆమనగల్, హైదరాబాద్ రహదారులతో పాటు అత్యంత ప్రాధాన్యమైన శ్రీశైలం రహదారికి కేంద్ర బిందువుగా కల్వకుర్తి ఉందని వివరించారు. గతంలో ఒక్క నియోజకవర్గం లేదా నాలుగు–ఐదు మండలాలతో జిల్లాలు ఏర్పడిన ఉదాహరణలు (వనపర్తి, ములుగు, సిరిసిల్ల తదితరాలు) ఉన్నాయని గుర్తు చేశారు. కల్వకుర్తి, ఊర్కొండ, మిడ్జిల్, వంగూరు, చారకొండ, వెల్దండ, తలకొండపల్లి, ఆమనగల్, కడ్తాల్, మాడుగుల మండలాలతో పాటు ఇర్విన్, ముద్విన్, వెల్జాల్, గట్టుప్పలపల్లి వంటి అర్హత కలిగిన ప్రాంతాలను కలిపి 12 నుంచి 16 మండలాలతో విశాల జిల్లాగా ఏర్పాటు చేసుకునే అవకాశముందని తెలిపారు. ప్రభుత్వం నడపడానికి అవసరమైన 66 శాఖలకు అనువైన మౌలిక వసతులు కూడా ఇక్కడ ఉన్నాయని స్పష్టం చేశారు. బూర్గుల రామకృష్ణారావు తర్వాత దక్షిణ తెలంగాణ నుంచి రెండవ ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న కల్వకుర్తి ముద్దుబిడ్డ తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్న నేపథ్యంలో, తమ పుట్టిన గడ్డకు న్యాయం చేస్తారని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్తర తెలంగాణలోని సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ ప్రాంతాల అభివృద్ధిని ఉదాహరణగా పేర్కొంటూ, అదే స్థాయిలో కల్వకుర్తిని కూడా జిల్లా చేసి చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలిపే నిర్ణయం తీసుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కల్వకుర్తి జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ప్రజలు ముఖ్యమంత్రిని ఉద్దేశించి తమ అభ్యర్థనను వినిపిస్తూ, జై కల్వకుర్తి… జై కల్వకుర్తి జిల్లా సాధన… జై రేవంతన్న అంటూ నినాదాలు చేశారు.
