గ్రామాభివృద్ధి చేస్తుంటేనే నాపై నిందలా

 గ్రామాభివృద్ధి చేస్తుంటేనే నాపై నిందలు… 

జీడిపల్లి సర్పంచ్ ఆంజనేయులు

కల్వకుర్తి, జనవరి 8 (మనఊరు ప్రతినిధి): కల్వకుర్తి మండలంలోని జీడిపల్లి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నందుకే కొందరు ప్రత్యర్థులు తనపై లేనిపోని నిందలు మోపుతున్నారని జీడిపల్లి గ్రామ సర్పంచ్ కంచ ఆంజనేయులు ఆరోపించారు. ప్రజల బాగోగులే లక్ష్యంగా గ్రామాభివృద్ధి చేపడుతుంటే రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జీడిపల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ముందున్న లక్ష్యమని, అందుకు అనుగుణంగా నిరంతరం కృషి చేస్తున్నానని తెలిపారు. గత ఐదేళ్లుగా గ్రామాభివృద్ధి చేయలేని నాయకులు ఇప్పుడు తనపై ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తాను పదవిలో లేకున్నా కూడా గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడ్డానని పేర్కొంటూ, సీసీ రోడ్లు, హైమాస్ట్ లైట్లు, రైతులకు ఎదురైన విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో చర్చించి ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు చేయించడంతో పాటు జీడిపల్లి గ్రామానికి విద్యుత్ సబ్‌స్టేషన్ మంజూరు చేయించినట్లు తెలిపారు. గ్రామ పండుగల నిర్వహణలో కూడా తానే ముందుండి పనిచేశానన్నారు. పంచాయతీ స్క్రాప్ సామాన్ల విక్రయంపై వస్తున్న ఆరోపణలను ఖండిస్తూ, పంచాయతీ సెక్రటరీ, ఉపసర్పంచ్‌లతో చర్చించి మాత్రమే నిర్ణయం తీసుకున్నామని, ఇప్పటివరకు ఎలాంటి సామాను విక్రయించలేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో స్క్రాప్ విక్రయించినా వచ్చే మొత్తాన్ని గ్రామసభ నిర్వహించి జీపీ ఖాతాలోనే జమ చేస్తామని తెలిపారు. రూ.100 లేదా రూ.200తో తాను ఆస్తులు సంపాదించుకోలేనని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ నిధులు వచ్చినా రాకున్నా, తన సొంత డబ్బులతో కూడా గ్రామాభివృద్ధి పనులు చేస్తున్నానని, ఇకపై తప్పుడు ఆరోపణలను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. తనపై, పంచాయతీ సెక్రటరీపై చేసిన నిరాధార ఆరోపణలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని, లేనిచో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామాభివృద్ధే తన మతమని, ప్రజాసేవకే తన జీవితం అంకితం చేస్తానని పేర్కొంటూ, ప్రతిపక్షాలు–మిత్రపక్షాలు అన్న తేడా లేకుండా అందరూ కలిసి గ్రామాభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. గ్రామపంచాయతీ నిధుల నుంచి ఒక్క పైసా కూడా వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకోలేదని స్పష్టం చేశారు.

Previous Post Next Post