*డీకే కాన్వాయ్‌కు ప్రమాదం..*
*ఐదుగురికి గాయాలు*
మాండ్య: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శనివారంనాడు తృటిలో ప్రమాదం తప్పించుకున్నారు. మాండ్యా జిల్లాలో ఆయన కాన్వాయ్‌లోని ఒక వాహనం బోల్తాపడటంతో డ్రైవర్‌తో సహా ఐదుగురు ఎస్కార్ట్ సిబ్బంది గాయపడ్డారు.
శ్రీరంగపట్న ప్రాంతంలోని ఎక్స్‌ప్రెస్‌వేపై గౌడహళ్లి సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎస్కార్ట్ వాహనం డివైడర్‌ను ఢీకొట్టి తల్లకిందులైంది. క్షతగాత్రులను మైసూరులోని ఆసుపత్రికి తరలించారు. వారికి తగిన వైద్య చికిత్స అందేలా చూడాలని అధికారులను డీకే శివకుమార్ ఆదేశించారు. ఎస్పీ మల్లికార్జున్ బలదండి స్వయంగా ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రుల పరిస్థితిని తెలుసుకున్నారు.
బెంగళూరుకు చేరుకున్న డీకే
కాగా, కాన్వాయ్ ప్రమాదం అనంతరం డీకే శివకుమార్ తిరిగి బెంగళూరుకు చేరుకున్నారు. ఆయన వెనుకనున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను తాకడంతో బోల్తాపడిందని ప్రాథమిక సమాచారం. డీకే మైసూరులో జరిగిన సాధనా సమావేశ ప్రోగ్రాంలో పాల్గొని బెంగళూరు తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీనిపై శ్రీరంగపట్న రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.