విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యలపై ఆగస్టు 2న కలెక్టరేట్ వద్ద ధర్నా
-ఫ్యాప్టో నేతలు మాదన విజయకుమార్, జి.వి.సుబ్బారెడ్డి
కడప, బ్యూరో, బద్వేల్, జులై 31 (మనఊరు ప్రతినిధి): విద్యా రంగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై ఆగస్టు 2వ తేదీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కడప జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు మాదన విజయకుమార్, హెచ్ఎంఏ జిల్లా అధ్యక్షులు జి.వెంకటసుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం బద్వేల్ లోని స్థానిక ఎంఆర్సీ వద్ద ఫ్యాప్టో బద్వేలు ప్రాంతీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు అనేక హామీలనిచ్చిన కూటమి ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ, ఉపాధ్యాయులను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు పాటుపడతామని, ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని హామీ ఇచ్చిన కూటమి పెద్దలు విద్యారంగంపై పలు ప్రయోగాలను చేస్తూ ప్రభుత్వ విద్యను నిర్వీర్యపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పేద, బడుగు, బలహీన వర్గాలు విద్యను అభ్యసించే ప్రభుత్వ పాఠశాలల్లో పాలకుల విధానాల ఫలితంగా విద్యా బోధన కరువైందని, ఉపాధ్యాయులను అనునిత్యం బోధనేతర కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడం పరిపాటిగా మారిందన్నారు. ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసేందుకే ఉపాధ్యాయులను బోధనకు దూరం చేస్తున్నదని ఆరోపించారు. దీర్ఘకాలంగా అపరిస్కృతంగా ఉన్న ఏకీకృత సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించి విద్యా శాఖలో అసంబద్దాలను తొలగించాల్సింది పోయి, మండల విద్యాశాఖాధికారి-1 పోస్టులను ప్రభుత్వ ఉపాధ్యాయులకు కట్టబెట్టడం తగదన్నారు. సమస్య న్యాయస్థానంలో ఉండగానే ఆత్రుతగా ఉత్తర్వులను జారీ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. జీవో 72, 73, 74 లను అమలు చేసి పంచాయతీరాజ్ టీచర్లకు న్యాయం చేయాలన్నారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన బదిలీలలో రీఅపోర్షన్మెంట్ ద్వారా బదిలీ పొందిన ఉపాధ్యాయులకు, అప్గ్రేడ్ అయిన స్థానాలను కోరుకున్న ఉపాధ్యాయులకు రెండు నెలలుగా జీతాలు చెల్లించలేదని విమర్శించారు. జీతాలు లేక ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారన్నారు. 2024 జూలై 1వ తేదీ నాటికే 12వ పిఆర్సీని అమలు చేయాల్సి ఉన్నప్పటికీ, గత పాలకులు, ప్రస్తుత పాలకులు ఇరువురూ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. తక్షణం పిఆర్సీని ఏర్పాటు చేయాలని, పిఆర్సీ అమలయ్యే వరకు 30 శాతం మధ్యంతర భృతిని చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న మూడు డిఎ ల చెల్లింపులకు తక్షణం చర్యలు చేపట్టాలని, ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించాల్సిన గత పిఆర్సీ బకాయిలతోపాటు సరెండర్ లీవ్, ఏపీజిఎల్ఐ, డీఏ బకాయిలను చెల్లించాలన్నారు. హై స్కూల్ ప్లస్ లలో వెంటనే ఉపాధ్యాయ నియమాకాలు చేపట్టి, వాటిని యధాతధంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు జీవన్మరణ సమస్యగా ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, 2004 సెప్టెంబర్ ఒకటవ తేదీ కి ముందు విడుదలైన నోటిఫికేషన్ ద్వారా నియమితులైన వారందరికీ కేంద్ర ప్రభుత్వం మెమో 57ను అమలు చేసి పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలన్నారు. అంతర్ జిల్లా బదిలీలను నిర్వహించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంతో పాటు సమాంతరంగా తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలని, పరీక్షలు తెలుగులో కూడా రాసేందుకు అవకాశం కల్పించాలని వారు కోరారు. సూపర్ న్యూమరీ పోస్టులను ఏర్పాటు చేసి భాషోపాధ్యాయులకు, వ్యాయామ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల సానుకూలంగా స్పందించి సమస్యలను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు గంజి పెంచలయ్య, టి.శివప్రసాద్, కె.సుధాకర్, ఎం.సుబ్బరాయుడు, ఎస్.దేవానందం, సి.కంచిరెడ్డి, పి.చంద్రశేఖర్ యాదవ్, ఎస్.మస్తాన్ వలి, ఎన్.పవన్ కుమార్, ఎస్.బాలయ్య, ఆర్.రాజా, కొండయ్య, ఎ.లాజరయ్య, వెంకట సుబ్బయ్య, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.