మళ్లీ తెరపైకి పోలేపల్లి పంచాయితీ నిధుల దుర్వినియోగం రచ్చ
ఈసారి తాడోపేడో తేల్చుకునేందుకు గ్రామస్తుల నిర్ణయం
దుర్వినియోగమైన నిధులను రికవరీ చేయించేందుకు కృషి
నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చర్యలకు డిమాండ్
నిధుల దుర్వినియోగం కేసు నాన్చుడు పట్ల గ్రామస్తుల ఆందోళన
ఎంపిడిఓ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు
జడ్చర్ల రూరల్, జులై 7 (మనఊరు ప్రతినిధి): గత సంవత్సరం సెప్టెంబర్ నెల 17వ తేది వెలుగులోకి వచ్చిన పోలేపల్లి పంచాయతీ నిధుల దుర్వినియోగానికి సంబంధించిన రచ్చ సోమవారం మళ్ళీ మొదలైంది. పంచాయితీలో దుర్వినియోగమైన ఒక్క కోటి 73 లక్షల నిధులను రికవరీ చేయడంతో పాటు అందుకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం గ్రామస్తులు మండల పరిషత్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు గత సంవత్సరం సెప్టెంబర్ నెల 17వ తేదీన మన ఊరు దినపత్రిక " పోలేపల్లి పంచాయతీలో రికార్డుల ట్యాంపరింగ్ " శీర్షికన ప్రచురితనం చేసిన వార్తకు స్పందించిన జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అప్పటి డిపిఓ పాండు రంగయ్య ద్వారా విచారణ జరిపించగా గ్రామపంచాయతీలో 1.73 కోట్ల రూపాయలు దుర్వినియోగమైనట్లుగా తేలింది. దాంతో సంబంధిత గ్రామపంచాయతీ కార్యదర్శి శివ ప్రకాశ్ ను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ గ్రామ మాజీ సర్పంచ్ జనంపల్లి చేతనారెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తనకు షోకాజ్ నోటీసులు జారీ కావడంతో సర్పంచ్ చేతనా రెడ్డి న్యాయ పోరాటానికి దిగారు. అందుకు దీటుగా జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి త్రీ మెన్ కమిటీ ద్వారా తిరిగి విచారణకు ఆదేశించారు. ఈ విషయంలో నాన్చుడు ధోరణి కనిపించడంతో పాటు నిధులు దుర్వినియోగం చేసినట్లు తేలి సుమారు 10 నెలలు కావస్తున్నా నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు విచారణలో తేలిన సర్పంచ్ చేతనా రెడ్డి, ఉప సర్పంచ్ లావణ్యల నుండి నిధులను రికవరీ చేయకపోవడం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో విసిగి వేసారిన గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి రఘునందన చారి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షల ద్వారా దుర్వినియోగమైన గ్రామపంచాయతీ నిధులను రికవరీ చేయించడంతో పాటు,నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు డిపిఓ విచారణలో తేలిన సర్పంచ్ చేతనా రెడ్డి, ఉప సర్పంచ్ లావణ్యలకు తగిన శిక్షలు వేయించాలని దీక్షలు చేపట్టిన వారు నిర్ణయించారు. రిలే నిరాహార దీక్షలకు అధికారులు స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని దీక్షలకు నేతృత్వం వహించిన రఘునందన చారి హెచ్చరిస్తున్నారు. రఘునందన చారి ఆధ్వర్యంలో గ్రామస్తులు రిలే నిరాహార దీక్షలు చేపట్టడంతో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి జిల్లా కలెక్టర్ విజయేందిర బోయితో దుర్వినియోగమైన నిధులను రికవరీ చేయాలని, దుర్వినియోగానికి పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. రఘునందన చారి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు పలు ప్రజాసంఘాల నాయకులతోపాటు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పలువురు గ్రామస్తులు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.పోలేపల్లి అక్రమాలపై ఎమ్మెల్యే ఆగ్రహం
-డిపిఓ నిర్లక్ష్యంపై అనిరుధ్ రెడ్డి ఆగ్రహం.
- గ్రామస్తుల నిరసనకు స్పందించిన ఎమ్మెల్యే
- తక్షణం చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్ కు ఫోన్
జడ్చర్ల, జులై 7 (మనఊరు ప్రతినిధి): జడ్చర్ల మండల పరిధిలోని పోలేపల్లి పంచాయతీలో జరిగిన రూ.1.73 కోట్ల నిధులు దుర్వినియోగంపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి జిల్లా కలెక్టర్ ను సోమవారం కోరారు. ఈ విషయంలో డిపిఓ నిర్లక్ష్యం పట్ల ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. డిపిఓ నిర్లక్ష్యం కారణంగానే పోలేపల్లి అక్రమాలపై చర్యలు తీసుకోవడంలో ఆలస్యం జరుగు తోoదని అభిప్రాయపడ్డారు.
జడ్చర్ల మండలంలోని పోలేపల్లి గ్రామ పంచాయతీలో జరిగిన అక్రమాలు నిధుల దుర్వినియోగంలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడం ఈ విషయంగా డిఎల్ పిఓతో అధికారులు విచారణ జరిపించడంతో పోలేపల్లి పంచాయతీలో రూ.1.73 కోట్ల మేరకు నిధులు దుర్వినియోగం అయ్యాయని పోలేపల్లి సర్పంచ్ జనంపల్లి చేతనరెడ్డి అప్పట్లో పనిచేసిన పంచాయతీ కార్యదర్శి ఈ అక్రమాలకు పాల్పడ్డారని డిఎల్ పిఓ నివేదిక ఇవ్వడం అందరికీ తెలిసిందే. అయితే ఇది జరిగిన కొన్ని నెలలు కావస్తున్న డిపిఓ ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. డిఎల్ పిఓ విచారణలో అక్రమాలు జరిగాయంటూ స్పష్టమైన నివేదిక ఇచ్చినప్పటికీ ఈ అంశాన్ని మరోసారి విచారించాలంటూ డిఆర్ డిఓ పిడి, పిఆర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, జడ్చర్ల ఎంపిడిఓలతో త్రిమెన్ కమిటీని ఏర్పాటు చేయడం, ఆ కమిటీ తమ విచారణను పూర్తి చేసి 3 నెలలు కావోస్తున్న నివేదికను సమర్పించకపోవడం పట్ల అనిరుధ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే పోలేపల్లి గ్రామస్తులు సోమవారం నిరసన దీక్షలు ప్రారంభించి నిధుల దుర్వినియోగంపై తక్షణ చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఈ విషయంగా స్పందించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి తో ఫోన్ లో మాట్లాడి పోలేపల్లి అక్రమాలపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. డిపిఓ నిర్లక్ష్యం కారణంగానే అక్రమార్కులపై చర్యలు తీసుకోవడం ఆలస్యం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే కమిటీ నివేదికను తెప్పించుకొని రూ.1.73 కోట్లు అక్రమాలకు పాల్పడిన వారి నుండి ఆ మొత్తాన్ని రికవరీ చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు.
ఈ విషయం గురించి వెంటనే చర్యలు తీసుకుంటానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి కలెక్టర్ హామీ ఇచ్చారు.