ముర్రుపాలు బిడ్డకు అమృతం
ఏఎన్ఎం వరలక్ష్మి
ఘనంగా తల్లిపాల వారోత్సవాలు
జడ్చర్ల రూరల్, ఆగస్టు 4 (మనఊరు ప్రతినిధి): తల్లిపాలు, ముర్రుపాలు బిడ్డలకు అమృతంతో సమానమని ఏఎన్ఎం వరలక్ష్మి పేర్కొన్నారు. సోమవారం మున్సిపాలిటీలోని 13వ వార్డ్ లోని చైతన్య నగర్ లోని అంగన్ వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లి పాల ప్రాముఖ్యత, తల్లి పాలు బిడ్డకు ఎంత అవసరమో తెలియజేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. బిడ్డ పుట్టిన మొదటి గంటలో తల్లి పసుపు రంగులోని చిక్కటి పాలు (ముర్రుపాలు) బిడ్డకు అమృతం లాంటివని వివరించారు. తల్లి పాలు సంపూర్ణ ఆహారమని, వీటిలో బిడ్డకు అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయనీ, వ్యాధి నిరోధక శక్తి కలుగుతుందని చెప్పారు. బిడ్డకు మొదటి 6 నెలలు తల్లి పాలే సంపూర్ణ ఆహారమన్నారు. 6 నెలలు దాటిన తరువాత తల్లి పాలతో పాటు అనుబంధ ఆహారం కూడా ఇస్తారని తెలిపారు. ఎక్కువగా ఆకుకూరలు తింటే ఆరోగ్యంగా ఉండడంతో పాటు లోపల పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటారని తల్లులకు వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్ వాడీ టీచర్ నాగమణి, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పిల్లల తల్లిదండ్రులు, పిల్లలు పాల్గొన్నారు.