కూలుతున్న మట్టి మిద్దెలు, పూరి గుడిసెలు
నవాబుపేట, ఆగస్టు 19 (మనఊరు ప్రతినిధి): గత వారం, పది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురు వర్షం కారణంగా మండలంలో మట్టి మిద్దెలు,పూరి గుడిసెలు దెబ్బతింటున్నాయి. నీటి దారలు నిరంతరంగా గోడల్లోకి ఇంకుతుండడంతో అవి కూలుతున్నాయి. మండల పరిధిలోని గురుకుంట గ్రామంలో బొవాళ్ల జంగయ్య అనే వ్యక్తి ఇల్లు కూలిపోవడంతో ఆయన కుటుంబం నిరాశ్రయంగా మారింది. ప్రభుత్వం వెంటనే ఇల్లు కూలి నిరాశ్రయులుగా మారిన వారిని గుర్తించి వారికి తాత్కాలిక పునరావాసం కల్పించడంతోపాటు నిత్యావసర వస్తువులు సరఫరా చేసి ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు.