రికార్డు స్థాయిలో సరుకుల పంపిణీ

 1800ల మందికి పది రకాల నిత్యావసర సరుకులు సరఫరా

తమ రికార్డును తామే తిరగరాసుకున్న జెకె ట్రస్ట్ నిర్వాహకులు

ప్రతికూల వాతావరణంలోను నిరాటంకంగా కార్యక్రమం 

రికార్డు స్థాయిలో సరుకుల పంపిణీ కార్యక్రమం విజయవంతం

 జెకె ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ 

నవాబుపేట, ఆగస్టు 19 (మనఊరు ప్రతినిధి): మండల కేంద్రంలోని జెకె ట్రస్ట్ నిర్వాహకులు మరోసారి ఏకంగా గ్రామంలోని 1800ల మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసి రికార్డు సృష్టించారు. గతంలో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామస్తులకు 1200ల కోళ్లను ఉచితంగా పంపిణీ చేసి రికార్డు సృష్టించిన వారే ఈసారి 1800ల మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసి తమ రికార్డును తామే తిరగరాసుకున్నారు. మండల కేంద్రంలో ఉదయం నుండి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నా ప్రతికూల వాతావరణాన్ని కూడా లెక్కచేయకుండా తాము తలపెట్టిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని వారు విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం విజయవంతంతో తమ తామే సాటి అని ట్రస్ట్ నిర్వాహకులు చాటుకున్నారు.

శ్రీశ్రీశ్రీ చౌడమ్మ, శ్రీశ్రీశ్రీ పోచమ్మ దేవతల బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని ట్రస్ట్ నిర్వాహకులు గ్రామంలోని 1800ల మందికి పది రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంచి నూనె, శనగపిండి, గోధుమపిండి, చక్కెర, సేమ్యా, గరం మసాలా, ఉప్పు, పసుపు, బట్టల సబ్బు, సంతూర్ సబ్బులతో కూడిన కిట్లను ట్రస్టు నిర్వాహకులు గ్రామస్తులకు అందజేశారు. ట్రస్ట్ నిర్వాహకుల ఔదార్యానికి గ్రామస్తులు అచ్చెరువొందారు.

ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడంతో నిర్వహిస్తున్న గ్రామస్తులు పులకించిపోయారు. అంతేకాక ట్రస్ట్ నిర్వాహకులను పిల్లాపాపలతో చల్లగా ఉండాలనివేనోళ్ల పొగిడారు.ఎల్లప్పుడూ తమకు ఈ విధంగానే దానధర్మాలు ఒసంగేందుకు వారికి సిరి సంపదలు పుష్కలంగా కల్పించాలని దేవాది దేవతలకు మొక్కుకుని ఇష్ట దైవాలను ప్రార్థించారు. అంతేకాక జె కె ట్రస్ట్ ఆ కుటుంబ సభ్యులకు భవిష్యత్తులో అంతా మంచే జరగాలని వారు అనుకున్నది కోరుకున్నది సాధించాలని గ్రామస్తులు నిండు మనస్సుతో ఆశీర్వదించారు. ఇకముందు మేమంతా మీ వెంటే ఉంటాం, మీరు ఏది చేసినా మేమంతా మీకే మద్దతు తెలుపుతాం అంటూ గ్రామస్తులు వారికి ఈ సందర్భంగా భరోసాను కల్పించారు. కాగా తమ ఆహ్వానాన్ని మన్నించి గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి నిత్యావసర సరుకులు అందుకున్నందుకు ట్రస్ట్ చైర్మన్ నరసింహ్మ చారి తో పాటు ఆయన కుటుంబ సభ్యులు గ్రామస్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఊరుకొండ నరసింహ్మ చారి ఆయన సోదరుడు సుధాకర్ చారి, ట్రస్టు డైరెక్టర్లు ఊరుకొండ లక్ష్మి, ఊరుకొండ గీతారాణి, ప్రజామిత్రాచారి, డాక్టర్ దీపిక, విశ్వ నేత్రాచారి, స్నేహశ్రీ, హృదయ పవిత్రచారి, రామ్ చరణ్ చారి, అకిరా నందన్ చారి, ఆదృత్ క్రుతాన్ చారి, విశ్వనాథచారి, కమలమ్మ, తదితరులు పాల్గొన్నారు.










Previous Post Next Post