మంగలిగడ్డ తండా అభివృద్ధికి 20 లక్షలు ఖర్చు చేస్తానని హామీ
మిడ్జిల్, నవంబర్ (మన ఊరు ప్రతినిధి): మిడ్జిల్ మండలంలోని మంగలిగడ్డ తండా గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి ఏకగ్రీవం చేస్తే, గ్రామ అభివృద్ధికి రూ.20 లక్షలు కేటాయిస్తానని జరుపుల చందులాల్ ప్రకటించారు. గ్రామ ప్రజల కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వెల్లడించారు. గ్రామపంచాయతీకి మినీ అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచి పేద ప్రజలకు అత్యవసర వైద్యసేవలను ఉచితంగా అందిస్తానని తెలిపారు. అదేవిధంగా గ్రామస్తులకు ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్, ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ బోర్డులు, పేద ఆడబిడ్డల పెళ్లికి ఒక్కొక్కరికి రూ.5000 ఆర్థిక సహాయం అందించే పథకాన్ని అమలు చేస్తానని తెలిపారు. ప్రతి 6 నెలలకు ఉచిత కంటి వైద్య శిబిరం, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సహా అనేక అభివృద్ధి పనులు చేపట్టి మంగలిగడ్డ గ్రామపంచాయతీని తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శ గ్రామంగా నిలబెట్టేందుకు కృషి చేస్తానని చందులాల్ తెలిపారు.
