శిక్షణ పొందుతున్న మహిళలు వృత్తిలో నైపుణ్యం సాధించాలి
జిల్లా అదనపు కలెక్టర్ అమరేందర్ సూచన
జడ్చర్ల రూరల్, నవంబరు 7 (మనఊరు ప్రతినిధి): భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల సందర్భంలో స్థానిక సత్యసాయి మందిరంలో శ్రీ సాయి ప్రశాంతి ఛారిటబుల్ సేవా ట్రస్టు మరియు సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా అందిస్తున్న మహిళా టైలరింగ్, మగ్గం వర్క్, జ్యూట్ బ్యాగుల తయారీ శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ అమరేందర్ ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న మహిళలతో సమావేశమై అదనపు కలెక్టర్ అమరేందర్ మాట్లాడుతూ, మహిళలు సామాజిక సారధిగా ఎదగాలని, ఆర్థికంగా కుటుంబానికి బలంగా నిలబడాలని పిలుపునిచ్చారు. అందిస్తున్న శిక్షణను 100శాతం నైపుణ్యంతో నేర్చుకుని వృత్తిలో స్థిరంగా నిలదొక్కుకోవాలని సూచించారు. శిక్షణ అనంతరం సమాజానికి సేవ చేయగలగడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి కన్వీనర్ హకీమ్ విశ్వ ప్రసాద్, కమిటీ సభ్యులు బాలకృష్ణ, రంగారావు, ట్రస్ట్ కార్యదర్శి ఎలిమే ఈశ్వరయ్య, శిక్షకురాలు సుమలత, పూజారి వావిలాల రాజశేఖర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.



