లక్ష్మీపల్లి పాఠశాలలకు కూల్ వాటర్ క్యాన్‌ల పంపిణీ
దేవరకద్ర, నవంబరు 6 (మనఊరు ప్రతినిధి): మండలంలోని లక్ష్మీపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు తాగునీటి సదుపాయం మెరుగుపడేలా విశ్రాంత ఉపాధ్యాయులు డామేకర్ కమల్ రాజు, మహాదేవి దంపతులు మానవతా భావంతో ముందుకు వచ్చారు. తమ స్వంత ఖర్చుతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలకు 20 లీటర్ల సామర్థ్యం కలిగిన 6 కూల్ వాటర్ క్యాన్‌లను ఉచితంగా అందజేసి దాతృత్వాన్ని చాటుకున్నారు.
ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు, జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయకర్త లయన్ అశ్విని చంద్రశేఖర్ విజ్ఞప్తికి స్పందిస్తూ ఇటీవల హిందీ స్కూల్ అసిస్టెంట్‌గా ఉద్యోగ విరమణ చేసిన కమల్ రాజు, ఆయన సతీమణి మహాదేవి ఈ సేవ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా లయన్ అశ్విని చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వంతో పాటు విద్యాభిమానులు, దాతలు, ప్రజలు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల సంక్షేమం కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు ఆదర్శప్రాయమన్నారు. కూల్ వాటర్ క్యాన్‌లను అందించిన డామేకర్ దంపతులను శాలువాలు పొగడ్తలతో సత్కరించి అందరూ అభినందించారు. ఈ కార్యక్రమంలో హెచ్.ఎం.లు కెకె శ్రీనివాస్, ఎస్. కల్పన, ఉపాధ్యాయులు నాగేశ్వర్ రెడ్డి, విజయలక్ష్మీ, ఎ. చంద్రశేఖర్, కె. మురళీధర్, దోమ శంకర్, ఆశ్ర ఖాద్రి, మదన్ మోహన్, కావాలి సుజాత, కార్యాలయ సిబ్బంది నేటర్ అహ్మద్ బిన్ ఇసాక్, మాజీ ఉప సర్పంచ్ నాగేష్ గౌడ్, గ్రామ పెద్దలు రామిరెడ్డి, వెంకట్రాములు, తదితరులు పాల్గొన్నారు.

