విచ్చలవిడిగా మద్యం విక్రయాలు

అడుగడుగునా మద్యం అక్రమ విక్రయ దుకాణాలు

జాతరలో బొమ్మల దుకాణాలవలె మద్యం అక్రమ విక్రయ కేంద్రాలు 

అధిక ధరలకు మద్యం అమ్మకాలు 

మందుబాబుల జేబులకు చిల్లు

పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు

 భక్తులతో ఆకారణంగా గొడవ పడుతున్న తాగుబోతులు

 శాంతి భద్రతలకు విఘాతం 

ప్రశాంతమైన వాతావరణంలో ఈ విధమైన దుస్థితి నెలకొని ఉండడం దురదృష్టకరమని భక్తుల ఆవేదన 

 నవాబుపేట, నవంబరు 6 (మనఊరు ప్రతినిధి): మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో గల పర్వతాపూర్ మైసమ్మ దేవాలయం దగ్గర మద్యం అక్రమ విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. మద్యం విక్రయదారులు ఎలాంటి జంకు బొంకు లేకుండా విచ్చలవిడిగా మద్యాన్ని విక్రయిస్తున్నా సంబంధిత శాఖ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. వ్యాపారం లాభసాటిగా ఉండడంతో అక్కడికి దగ్గరలోని కొన్ని గ్రామాల వ్యాపారులు మద్యం విక్రయాలను జీవనోపాధిగా చేసుకుని విక్రయాలు జరుపుతున్నారు. వారు తమ ఇష్టానుసారంగా మద్యం అక్రమంగా జోరుగా విక్రయిస్తూ ఆలయం దగ్గర శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నా సంబంధిత ఆలయ పాలకవర్గం అక్రమ విక్రయాల గురించి పట్టించుకోకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. పవిత్రమైన ఆలయ పరిసరాల్లో ఈ విధమైన వ్యవహారాలు విచ్చలవిడిగా కొనసాగుతున్నా వారు పట్టించుకోకపోవడం విడ్డూరంగా కనిపిస్తున్నది. ఇదే అదునుగా భావిస్తూ మంచి తరుణం మించిన దొరకదు అన్న చందంగా వ్యవహరిస్తూ అక్రమ విక్రయాలు మద్యాన్ని అధిక రేట్లకు జోరుగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. చూసి చూడనట్లుగా ఆలయ పాలకవర్గం వ్యవహరిస్తుండడంతో అక్రమ విక్రయదారుల విక్రయాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. దాంతో వారు మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా తమ వ్యాపారాలను కొనసాగించుకుంటున్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు వస్తున్న భక్తులు అక్రమ విక్రయదారుల బారినపడి తమ జేబులను ఖాళీ చేసుకోవడంతో పాటు ఆరోగ్యాలను గుల్ల చేసుకుంటున్నారు. బహిరంగంగా ఇంత పెద్ద ఎత్తున మద్యం అక్రమ విక్రయాలు కొనసాగుతున్న సంబంధిత శాఖ అధికారులు తమ దృష్టికి రాలేదని పేర్కొంటుండడం ఆ శాఖ పనితీరు ఏ విధంగా ఉందో స్పష్టం చేస్తుంది. వారు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోతుండడం తో వారి విధుల నిర్వహణ పట్ల సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. అక్కడ విక్రయాలు జరుపుకునే వారు తమ విక్రయాలను కొనసాగించుకునేందుకు సంబంధిత శాఖ అధికారులతో ఏమైనా సంబంధాలు కొనసాగిస్తున్నారేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందువల్లే వారు అటువైపు రావడంలేదని వచ్చినా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పచ్చని చెట్ల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో వెలసిన మైసమ్మ దేవత అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి సన్నిధిలో హాయిగా గడుపుదామని వస్తున్న భక్తులకు అక్కడ లభిస్తున్న మద్యం సేవించి హంగామా సృష్టిస్తున్న తాగుబోతుల నుండి పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాగుబోతులు తప్ప తాగి అకారణంగా భక్తులతో వాగ్వివాదానికి దిగుతూ గొడవలు పెట్టుకోవడం ఇక్కడ సర్వ సాధారణంగా మారింది. ఇంత జరుగుతున్నా మైసమ్మ దేవాలయం దగ్గర మద్యం అక్రమ విక్రయాల గురించి గురించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఒకవేళ ఎవరైనా ఫిర్యాదు చేస్తే తాము చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు సెలవిస్తుండడం విడ్డూరం. బహిరంగంగా కొనసాగుతున్న విక్రయాలను గురించి వారు పట్టించుకోకపోగా ఫిర్యాదులు చేస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొంటుండడం విడ్డూరం. ఈ విషయమై మహబూబ్ నగర్ ఎక్సైజ్ సిఐ వీరారెడ్డిని వివరణ కోరగా మైసమ్మ దేవాలయం దగ్గర మద్యం అక్రమ విక్రయాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి రాలేదని అన్నారు. ఒకవేళ అక్కడ మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వస్తే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతంలో ఒకసారి ఫిర్యాదు వస్తే కేసులు నమోదు చేశామని అన్నారు.






Previous Post Next Post