సిరిధాన్యాల ఆహారంతో అనేక రోగాలకు నివారణ

 సిరిధాన్యాల ఆహారంతో అనేక రోగాలకు నివారణ

ప్రముఖ ఆహార నిపుణులు, ఆరోగ్యవేత్త డాక్టర్ ఖాదర్ వలీ

కల్వకుర్తి, కడ్తాల్, డిసెంబరు 29 (మనఊరు ప్రతినిధి): సిరిధాన్యాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బులు, జీర్ణకోశ సమస్యలు సహా అనేక దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని ప్రముఖ ఆహార నిపుణులు, ఆరోగ్యవేత్త డాక్టర్ ఖాదర్ వలీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత జీవనశైలి, రసాయనాలతో కూడిన ఆహార పదార్థాల వల్ల ప్రజలు అనేక రకాల వ్యాధులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మన పూర్వీకులు అనుసరించిన సిరిధాన్యాల ఆధారిత సహజ ఆహార విధానం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, వరి కాకుండా ఇతర చిన్న ధాన్యాలు శరీరానికి కావలసిన పోషకాలను సమృద్ధిగా అందిస్తాయని, ముఖ్యంగా షుగర్ నియంత్రణలో సిరిధాన్యాల పాత్ర కీలకమని చెప్పారు. మందులపై ఆధారపడకుండా ఆహారంతోనే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. సిరిధాన్యాల వినియోగం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు జీర్ణశక్తి మెరుగవుతుందని, పిల్లలు నుంచి వృద్ధుల వరకు అందరూ వీటిని ఆహారంలో చేర్చుకోవాలని డాక్టర్ ఖాదర్ వలీ పిలుపునిచ్చారు.

ఆధ్యాత్మిక గురువుల సమ్మేళనం

పత్రీజీ ధ్యాన మహాయాగంలో భాగంగా నిర్వహించిన ఆధ్యాత్మిక గురువుల సమ్మేళనంలో బ్రహ్మకుమారి సమాజానికి చెందిన సిస్టర్ అర్చన, రామచంద్ర మిషన్ డైరెక్టర్ కె.ఎస్. అరవింద్, సేవాలాల్ నాయక్ 7వ తరానికి చెందిన కమల్ రాథోడ్, ఎస్పీ నాయక్, లంబాడా సేవాసమితి గోపాల గురువు, మాత మాణికేశ్వరీ ట్రస్ట్ భీంసంకర్ స్వామి పాల్గొని జ్ఞాన సందేశాలు అందించారు. ఈ సందర్భంగా కె.ఎస్. అరవింద్ మాట్లాడుతూ ఏదైనా సాధించాలంటే ఆత్మబలం, దైవబలం, ప్రకృతి బలం అవసరమని, ఈ మూడు ధ్యానంతోనే లభిస్తాయని చెప్పారు. ఎస్పీ నాయక్ మాట్లాడుతూ జ్ఞానం ఉంటే ఏదైనా సాధ్యమని, ప్రతి ఒక్కరూ జ్ఞానం పెంపొందించుకోవాలని సూచించారు. సిస్టర్ అర్చన విశ్వశాంతి కోసం కృషి చేయాలని, క్లిష్ట పరిస్థితులను జయించేందుకు ఆత్మశక్తిని పెంచుకోవాలని అన్నారు. ధ్యానం ద్వారానే మోక్షం లభిస్తుందని, మనలో వెలుగును నింపే ఏకైక మార్గం ధ్యానమేనని కమల్ రాథోడ్ వెల్లడించారు.




Previous Post Next Post