ఘనంగా మార్చాలలో కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం
పార్టీ జెండాను ఆవిష్కరించిన నాయకులు
కల్వకుర్తి, డిసెంబరు 28 (మనఊరు ప్రతినిధి): మండల పరిధిలోని మార్చాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రధాని కూడలి వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ పరాయి పాలన నుంచి దేశానికి విముక్తి కల్పించిన ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని గుర్తు చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు దేశ స్థితిగతులను మార్చి, అభివృద్ధి పథంలో నడిపించడంలో కాంగ్రెస్ పార్టీ తనదైన పాత్రను పోషించిందని అన్నారు. అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడుతూ, భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పడంలో కాంగ్రెస్ పార్టీ కృషి ఎనలేనిదని పేర్కొన్నారు.
నేడు పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా, పార్టీ కోసం జెండా మోసి ముందుకు నడిపిస్తున్న నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

