స్త్రీనిధి ఉద్యోగుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలి
బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డికి స్త్రీనిధి వెల్ఫేర్ అసోసియేషన్ వినతి
నాగర్ కర్నూల్, డిసెంబరు 28 (మనఊరు ప్రతినిధి): స్త్రీనిధి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డిని స్త్రీనిధి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించారు. సంస్థలో అక్రమాలకు పాల్పడుతూ దీర్ఘకాలికంగా కొనసాగుతున్న రిటైర్డ్ మేనేజింగ్ డైరెక్టర్‌ను తక్షణమే తొలగించాలని ప్రభుత్వానికి సూచించాలని వారు డిమాండ్ చేశారు. అక్రమాలపై విచారణకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్–523కు సంవత్సరం పూర్తవుతున్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి ఎంక్వయిరీ జరగకపోవడం దురదృష్టకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత శాఖ మంత్రి చొరవ తీసుకొని నిష్పక్షపాత విచారణ జరిపి, రాష్ట్రంలో ఉన్న 64 లక్షల మంది మహిళలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని, ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించాలని మహేశ్వర్‌రెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో స్త్రీనిధి వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు నాగపూర్ రాములు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.
