గ్రామపంచాయతీ ఎన్నికల బహిష్కరణ

ఎర్రవెల్లి గ్రామపంచాయతీ ఎన్నికలకు బహిష్కరణ

రిజర్వాయర్ ముంపు బాధితుల రిలే నిరాహార దీక్ష

కల్వకుర్తి, డిసెంబరు 5 (మనఊరు ప్రతినిధి): నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని ఎర్రవెల్లి గ్రామంలో పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు ఉద్రిక్తత నడుమ జరుగుతున్నాయి. గ్రామం రిజర్వాయర్ ముంపు ప్రాంతంలోకి చేరడంతో ప్రభుత్వంపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ గ్రామస్తులు గ్రామపంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు.

గత కొన్ని సంవత్సరాలుగా రిజర్వాయర్ నిర్మాణం కారణంగా భూములు కోల్పోతున్న రైతులకు సరైన భూ పరిహారం అందలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. గ్రామస్తుల వివరాల ప్రకారం, ఎర్రవెల్లి గ్రామంలో మొత్తం 593 ఎకరాలు 27 గుంటల భూమి ముంపుకు గురవుతోంది. ఈ సందర్భంగా ప్రభుత్వం ఎకరాకు రూ.5.50 లక్షలు మాత్రమే నష్టపరిహారంగా ప్రకటించడం పట్ల రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామం పూర్తిగా ముంపుకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్న బాధితులు,
రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గిస్తే గ్రామం ముంపు సమస్య నుంచి బయటపడుతుంది అని పలుమార్లు సంబంధిత అధికారులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ, ఇప్పటివరకు ఏ విధమైన చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఎర్రవెల్లి గ్రామస్తులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మా పోరాటం ఆగదు అని బాధితులు తెలిపారు. తాజా పరిణామాలతో ఎర్రవెల్లి పంచాయతీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.

Previous Post Next Post