బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకోసం అందరూ కృషి చేయాలి
ర్యాలీ సందడిలో హేమలత నామినేషన్
జడ్చర్ల రూరల్, డిసెంబరు 5 (మనఊరు ప్రతినిధి): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్, వార్డ్ సభ్యుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ శ్రమించాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రఘుపతిరెడ్డి అన్నారు. శుక్రవారం నసురుల్లాబాద్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బలపర్చిన పాలకొండ హేమలత నామినేషన్ సందర్భంలో కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పార్టీ అభ్యర్థుల విజయం కోసం నాయకలు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని రఘుపతిరెడ్డి సూచించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడంపై ప్రజల్లో అవగాహన కల్పించేలా ప్రచారాన్ని విస్తరించాలని పిలుపునిచ్చారు. హేమలత నామినేషన్ సందర్భంగా గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించగా కార్యకర్తలు, స్థానికులు విస్తృతంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ కొడుగల్ యాదయ్య, గ్రామ మాజీ సర్పంచ్ సత్యవతి, మాజీ సర్పంచ్ ప్రణీల్ చందర్, మాజీ డిప్యూటీ సర్పంచ్ మునావర్, నాయకులు కరాటే శ్రీను, మాసయ్య, నవీన్ సాగర్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.


