ఘనంగా ఘంటసాల జయంతి సంబరాలు
పల్లవి చరణ్ మ్యూజిక్ అకాడమీ నిర్వహించిన వేడుకలకు అభిమానుల స్పందన వెల్లివిరిసింది
హైదరాబాద్, డిసెంబరు 5 (మనఊరు ప్రతినిధి): పల్లవి చరణ్ మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన ఘంటసాల జయంతి ఉత్సవాలు, అకాడమీ అధినేత రమణారెడ్డి జన్మదిన వేడుకలు సంగీతాభిమానులను మంత్రముగ్ధులను చేశాయి. త్యాగరాజ గానసభ కళా సుబ్బారావు వేదికగా మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగిన ఈ కార్యక్రమంలో గాయని గాయకుల సందడి అలరించింది. ఘంటసాల జయంతిని పురస్కరించుకొని ఆయన సంగీత నేపథ్యంలోని ఎన్నో స్వర్ణిమ గీతాలను కళాకారులు ఆలపించగా ప్రేక్షకులు మంత్ర ముగ్ధులయ్యారు. అకాడమీ అధినేత రమణారెడ్డి మాట్లాడుతూ తన చిరకాల మిత్రులు లక్ష్మణ్, తిరుపతిరెడ్డి, మురళి, ఉమేష్‌కుమార్, కలగ కృష్ణారావు, బ్రహ్మశ్రీ వీణపాణి శాస్త్రి, రమేష్ (టిడిపి) తదితరులు పాల్గొనడం ఎంతో ఆనందకరం అని తెలిపారు. తనయుడు చరణ్ కూడా పాల్గొనడం, అదే రోజు ఘంటసాల జయంతి జరగడం మరింత ఆనందాన్నిచ్చిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో గాయకులు సుబ్బరామన్, నాగేశ్వరరావు, ఎస్. ఎన్ సహా నక్వీ, వెంకటలక్ష్మి, భాగ్యలక్ష్మి, శ్రీనివాస్, కళ్యాణ్, రాధారాణి, నూతన గాయకుడు దాస్ (చిలకలూరిపేట) తదితరులు ఘంటసాల గీతాలను ఆలపించి ప్రేక్షకాదరణ పొందారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంజనీ కుమారి మాట్లాడుతూ ఘంటసాల జయంతి, రమణారెడ్డి పుట్టిన రోజు ఒకే రోజు రావడం సంతోషకరమని పేర్కొన్నారు. ఘంటసాల పాటలు ఆణిముత్యాలుగా సంగీతాభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని తెలిపారు. కొత్త గాయకులకు అవకాశాలు కల్పిస్తున్న రమణారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. మరొక అతిథి ఉమేష్ మాట్లాడుతూ సంగీతం సమాజానికి శాంతిని పంచుతుందని, ఘంటసాల పాటలు పాడటం అంత ఈజీ పని కాదని, రమణారెడ్డి టీం అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించిందని కొనియాడారు. పురోహిత్ ప్రాణి వేడుకలకు విచ్చేసి గాయని గాయకులకు, అతిథులకు ఆశీస్సులు అందించారు. రమణారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేశారు.



