కనుల పండువగా అయ్యప్ప స్వామి తిరు ఆభరణాల ఊరేగింపు
జడ్చర్ల పట్టణంలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక పరిమళం
జడ్చర్ల రూరల్, డిసెంబరు 27 (మనఊరు ప్రతినిధి): పట్టణంలోని పద్మావతి కాలనీలోని తూడి పుల్లారెడ్డి గృహంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అయ్యప్పస్వామి తిరు ఆభరణాలు, అభిషేక విగ్రహంతో పాటు కలశాన్ని బాజాభజంత్రిలతో ప్రారంభమైన స్వామివారి ఆభరణాల ఊరేగింపు, పట్టణంలోని ప్రధాన కూడళ్ళ మీదుగా సాగుతూ మూడో వార్డు కల్వకుర్తి రోడ్డు సమీపంలోని శ్రీ జ్ఞాన సరస్వతి సహిత అయ్యప్ప స్వామి దేవాలయానికి కనుల పండువగా ఊరేగింపుగా తీసుకెళ్లారు. పట్టణంలో శనివారం ఆధ్యాత్మిక వాతావరణంతో పరిమళించింది. పట్టణ అయ్యప్ప దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి తిరు ఆభరణాల శోభాయాత్ర భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి ఆలయంలో హరి నారాయణ గురుస్వామి ఆధ్వర్యంలో మహా పడిపూజ వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హాజరైన అయ్యప్ప మాలధారులు భక్తిగీతాలు ఆలపిస్తూ భక్తి పారవశ్యంలో లీనమయ్యారు. దీంతో పట్టణమంతా ఆధ్యాత్మిక పరిమళం అలుముకుంది. అంతకుముందు ఉదయం ఆలయ కమిటీ సభ్యులు సుప్రభాత సేవ, లక్ష్మీ గణపతి హోమం, విశేష అభిషేకం, ద్వజారోహణం, అష్టోత్తర శతనామార్చన, పుష్పార్చన, తిరు ఆభరణాల పూజ, మహా మంగళహారతి ఘనంగా నిర్వహించారు. అనంతరం భారీగా హాజరైన అయ్యప్ప స్వాములు, భక్తులకు మాదినేని వెంగమ్మ, పెద్ద వెంగయ్యల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్వామివారి తిరు ఆభరణాల ఊరేగింపు, మహా పడిపూజ కార్యక్రమాలను అయ్యప్ప స్వామి దేవాలయ కమిటీ సభ్యులు అత్యంత వైభవోపేతంగా నిర్వహించడంతో కార్యక్రమం ఘన విజయాన్ని సాధించింది.



