ఎర్రవల్లి ప్రజల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవాలి

 ఎర్రవల్లి ప్రజల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవాలి

గ్రామాన్ని ముంపు నుంచి కాపాడాలి: పాలమూరు అధ్యయన వేదిక డిమాండ్

కల్వకుర్తి, డిసెంబరు 27 (మనఊరు ప్రతినిధి): చారగొండ మండలంలోని ఎర్రవల్లి గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పట్టించుకోవాలని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి డిమాండ్ చేశారు. శనివారం కల్వకుర్తి పట్టణంలోని యూటీఎఫ్ భవన్‌లో పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో ఎర్రవల్లి గ్రామాన్ని ముంపు నుంచి కాపాడాలనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వెంకట్ గౌడు అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా రాఘవాచారి, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, బీజేపీ నాయకులు తల్లొజు ఆచారి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సభ్యులు బాలాజీ సింగ్, మాజీ మున్సిపల్ చైర్మన్ యడు సత్యం, జేఏసీ నాయకుడు సదానందం గౌడ్ మాట్లాడారు. పేదరికంతో అల్లాడుతున్న పాలమూరు రైతాంగానికి నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధుల జలదోపిడి కంటశోకంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఎర్రవల్లి గ్రామం, ఎర్రవెల్లి తండాను ముంపు నుంచి కాపాడాలని, అలాగే డిండి ఎత్తిపోతల పథకాన్ని తక్షణమే రద్దు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. పాలమూరు జిల్లాకు చెందిన 14 మంది ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాలమూరు రైతుల హక్కులు, నీళ్ల సమస్యపై గళమెత్తాలని, నల్గొండ జలదోపిడిని వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎర్రవల్లి గ్రామానికి చెందిన 200 మంది రైతులు, మహిళలు పాల్గొన్నారు. వారితో పాటు సివిఐ పరశురాములు, దుర్గాప్రసాద్, రాజేందర్, రాఘవేందర్ గౌడ్, జంగయ్య, సాంబయ్య గౌడు, విజయ్ గౌడ్, ఏపీ మల్లయ్య, మార్చాల బాలయ్య, వెంకటయ్య, ఎర్రవెల్లి ప్రకాష్, ఎర్రవెల్లి శ్రీనివాస్, ఎర్రవల్లి నాగయ్య తదితరులు హాజరయ్యారు.

Previous Post Next Post