విద్యతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలి

 విద్యతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలి

కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సూచన

కల్వకుర్తి, డిసెంబరు 27 (మనఊరు ప్రతినిధి): విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లో కూడా రాణించి సమగ్ర వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలని స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సూచించారు. కల్వకుర్తి పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో ఈ నెల 26, 27 తేదీలలో నిర్వహించిన విభాగ్ సాయి ఖేలుద్ క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి శనివారం ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు నృత్య ప్రదర్శనలతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతీయ భావాలు కలిగిన విద్యాసంస్థల్లో చదవడం విద్యార్థుల అదృష్టమని అన్నారు. విద్య ద్వారానే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. క్రీడాకారులను ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సభ్యులు ఠాకూర్ బాలాజీ సింగ్ మాట్లాడుతూ తాను కూడా శ్రీ సరస్వతి శిశు మందిర్‌లో చదవడం గర్వంగా భావిస్తున్నానని తెలిపారు. విద్యార్థులు ఒక లక్ష్యంతో కష్టపడి చదువుకుంటే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని అన్నారు. పాలమూరు విభాగ్ ఉపాధ్యక్షులు మద్ది అనంత రెడ్డి మాట్లాడుతూ క్రీడల ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని పేర్కొన్నారు. ఈ విభాగ్ స్థాయి క్రీడా పోటీలలో సుమారు 650 మంది విద్యార్థినీ–విద్యార్థులు పాల్గొన్నారు. వివిధ క్రీడా విభాగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ బహుమతులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలమూరు విభాగ్ శైక్షణిక్ ప్రముఖ్ కండే కృష్ణమోహన్, నాయకులు ఆనంద్ కుమార్, బండెల రామచంద్రారెడ్డి, విజయేందర్, విజయ్ కుమార్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రమాకాంత్ రెడ్డి, గోరేటి శ్రీను, చంద్రకాంత్ రెడ్డి, భూపతి రెడ్డి, బాలు నాయక్, వెంకటేష్, పాఠశాల ప్రబంధక సంఘ సభ్యులు, సమితి సభ్యులు, ఆచార్యులు, మాతాజీలు, విద్యార్థులు పాల్గొన్నారు.







Previous Post Next Post