రామాలయంలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

 రామాలయంలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు

ఉత్తర ద్వార దర్శనం, విష్ణు సహస్రనామ పారాయణంతో పరవశించిన భక్తజనం

నాగర్‌కర్నూలు, డిసెంబరు 30 (మనఊరు ప్రతినిధి): వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం నాగర్‌కర్నూలు జిల్లా కేంద్రంలోని రాంనగర్ కాలనీలో గల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఈ విషయాన్ని రామాలయ ప్రధాన అర్చకులు కందాడై వరదరాజన్ అయ్యంగా తెలిపారు. తెల్లవారుజామున 4.30 గంటలకు ఉత్తర ద్వార పూజలు ప్రారంభమయ్యాయి. అనంతరం ఉత్సవ విగ్రహాలను భక్తుల కోలాటాలు, భజనల నడుమ ఆలయ ఆవరణలో పల్లకీ సేవను ఘనంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను ఉత్తర ద్వారం ద్వారా ఆలయంలో ప్రవేశపెట్టిన అనంతరం వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా శ్రీరామ మహిళా యువత, ఓం శ్రీ రక్ష మహిళా సంఘ సభ్యులు కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలకు మరింత శోభ చేకూర్చారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని మాలాధారణ చేసిన వికాసతరంగిణి సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిత్య విష్ణు సహస్రనామ పారాయణ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో 11 సార్లు విష్ణు సహస్రనామ పారాయణం భక్తిశ్రద్ధలతో జరిగింది. తెల్లవారుజాము నుంచి ప్రదోషకాలం వరకు భక్తులు విడతల వారీగా స్వామివార్లను దర్శించుకున్నారు. గోదాదేవి అమ్మవారికి ప్రత్యేకంగా పాశుర పఠనం, తిరుప్పావై సేవాకాలం, కుంకుమార్చన, పుష్పార్చన వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలు, పండ్లు ప్రత్యేకంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు కందాడై శ్రీనివాసాచార్యులు, కరుణశ్రీ, పద్మ, విజయలక్ష్మి, గోమటం మురళీమోహన్ ఆచార్యులు, వెంకట్రామన్, వేణుగోపాల్, ఆలయ కమిటీ సభ్యులు అర్థం రవీందర్, మల్లేష్, గొల్ల రాములు, మన్యపు రెడ్డి, పోల రాణి, యాదమ్మ, అలాగే హకీం సుదర్శన్, శారద, రమాదేవి, రామారావు, నిరంజన్, రఘునందన్ గౌడ్, విజయ్‌కుమార్, స్వామి తదితరులు పాల్గొన్నారు. కాలనీవాసులు, మహిళలు, భక్తులు వేలాది సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.






Previous Post Next Post