పోగొట్టుకున్న ఫోన్‌ను వెతికి ఇచ్చిన ఆర్టీసీ సిబ్బంది…
జడ్చర్ల, డిసెంబర్ (మనఊరు ప్రతినిధి): ప్రయాణికుల భద్రత, సేవలపట్ల ఆర్టీసీ సిబ్బంది చూపిన కర్తవ్యనిబద్ధత మరోసారి కనువిందు చేసింది. నారాయణపేట నుండి జడ్చర్లకు ప్రయాణించిన నేహా అనే యువతి (తండ్రి పేరు చిన్న, గ్రామం దేవరకొండ, నల్గొండ జిల్లా) టిఫిన్ కోసం బస్సు దిగిన అనంతరం లోకల్ ఆటోలో ఎక్కే సమయంలో అనుకోకుండా తన మొబైల్ ఫోన్‌ను అక్కడే మర్చిపోయింది. ఫోన్ కోల్పోయిన విషయం తెలిసి ఆందోళనకు గురైన ఆమెకు, డ్యూటీలో ఉన్న స్టేషన్ మాస్టర్ రవీంద్రనాథ్, అలాగే ఆర్టీసీ సెక్యూరిటీ గార్డ్ లింగంపేట నరసింహులు వెంటనే స్పందించారు. సమాచారం అందిన వెంటనే వారు శ్రమించి ఫోన్‌ను గుర్తించి సురక్షితంగా తిరిగి నేహాకు అందజేసారు. ఈ సందర్భంలో స్థానికులు ఆర్టీసీ సిబ్బంది చూపిన నిజాయితీ, సేవాభావాన్ని అభినందించారు. ప్రయాణికుల భద్రత కోసం ఇలాంటి చర్యలు ఆదర్శప్రాయమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.
