గ్రామాల ప్రగతికి సర్పంచులే పునాది
అంకితభావంతో పనిచేయాలి
మంత్రి వాకిటి శ్రీహరి
హైదరాబాద్, డిసెంబరు 30 (మనఊరు ప్రతినిధి): నూతనంగా ఎన్నికైన సర్పంచులను రాష్ట్ర మంత్రి వాకటి శ్రీహరి మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలే దేశానికి వెన్నెముకలాంటివని, ప్రజలు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాభివృద్ధికి అంకితభావంతో కృషి చేయాలని సర్పంచులకు సూచించారు.
సర్పంచులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి చొరవ చూపాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామాల సమగ్ర అభివృద్ధితోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమవుతుందని మంత్రి స్పష్టం చేశారు.
ఈ సన్మాన కార్యక్రమంలో డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ గ్రామాల సర్పంచులు, ముదిరాజ్ సంఘం ప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది.


