రథయాత్రకు ఘన స్వాగతం పలికిన సాయి భక్తులు
బతుకమ్మ, భజనలతో పట్టణం మారుమోగింది
కల్వకుర్తి, డిసెంబరు 8 (మనఊరు ప్రతినిధి): భగవాన్ సత్యసాయి బాబా శత జయంతి మహోత్సవాల నేపథ్యంలో పుట్టపర్తి నుంచి ప్రారంభమైన శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథయాత్ర సోమవారం కల్వకుర్తి పట్టణంలో ధార్మికోత్సవాల సందడి రాజేసింది. ప్రశాంతి సన్నిధి దివ్యమందిరం వద్ద నుంచి సాయంత్రం 4:30 గంటలకు రథయాత్ర మొదలైంది. రథం పురవీధుల గుండా ప్రయాణించే సమయంలో ప్రతి ఇంటి వద్ద భక్తులు కట్టారపు నీటితో స్వాగతం పలకగా ఆధ్యాత్మిక వాతావరణం అలుముకుంది. పుష్పాలతో నమస్కారాలు సమర్పిస్తూ, కొబ్బరికాయలు పగలగొట్టి మంగళహారతులు ఇచ్చారు. రథం ముందుగా మహిళలు బతుకమ్మ ఆడి ఆకట్టుకోగా వారి మీద భక్తులు పూల వర్షం కురిపించారు. సాయి భక్తులు భజనలు, కీర్తనలు, కొలాటాలతో పట్టణాన్ని కళకళలాడించారు. బస్టాండ్, శివాలయం, హనుమాన్ టెంపుల్, రవిచెట్టు వీధి, వెంకటేశ్వరస్వామి దేవాలయం, మైసమ్మ గుడి, సిల్వర్ జూబ్లీ క్లబ్, హైదరాబాద్ చౌరస్తా, గాంధీనగర్, అశోక టాకీస్ మార్గంలో రథయాత్ర సాగి తిరిగి సత్యసాయి మందిరానికి చేరింది. అనంతరం మహామంగళహారతి నిర్వహించి అల్పాహార ప్రసాదం పంపిణీ చేశారు. తరువాత రథం వికారాబాద్ జిల్లాకు బయలుదేరినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో మహిళలు, చిన్నారులు, భక్తులు పాల్గొన్నారు.


