పదవ తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలి
టీఎస్‌టీయూ జిల్లా క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
మహబూబ్‌నగర్, (మనఊరు ప్రతినిధి): తెలంగాణ స్టేట్ టీచర్స్ యూనియన్ (టీఎస్‌టీయూ) మహబూబ్‌నగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సంఘం నూతన క్యాలెండర్‌ను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఘనంగ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి 100 శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది పదవ తరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో మహబూబ్‌నగర్ జిల్లా ప్రథమ స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చొరవతో త్వరలోనే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అల్పాహారం (బ్రేక్‌ఫాస్ట్) అందించే పథకం అమలు చేయనున్నట్లు తెలిపారు. ఇది విద్యార్థుల ఆరోగ్యం, హాజరు, విద్యా ప్రగతికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సతీష్, జిల్లా కార్యదర్శి తాహెర్ ఉపాధ్యాయ, ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్‌లో ఉన్న డీఏలు విడుదల చేయాలని, ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపునకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని, సీపీఎస్ రద్దు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు హమీద్, రాష్ట్ర కార్యదర్శులు ఫరీద్, శశిధర్, శరణప్ప, మల్లికార్జున్, శ్రీనివాసులు, కృష్ణ నాయక్, నాగేంద్రం తదితరులు పాల్గొన్నారు.
