యువతకు స్ఫూర్తిగా సీఎం కప్ టార్చ్ ర్యాలీ
క్రీడలు మానసిక ఉల్లాసానికి, శారీరక దృఢత్వానికి నిదర్శనం
– యువ నాయకులు అగారం ప్రకాష్
ఖిల్లా ఘనపూర్, జనవరి 9 (మనఊరు ప్రతినిధి): క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని మండల నాయకులు అగారం ప్రకాష్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కప్ (సీఎం కప్) సెకండ్ ఎడిషన్ క్రీడల సందర్భంగా ఖిల్లా ఘనపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన టార్చ్ ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గర్ల్స్ హై స్కూల్ నుంచి ప్రారంభమైన సీఎం కప్ టార్చ్ ర్యాలీలో పాల్గొన్న క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ… యువత క్రీడల్లో రాణించి మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. క్రీడా స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో వర్ధిల్లాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడలు గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి క్రీడలకు ఇస్తున్న ప్రాధాన్యత అభినందనీయమని పేర్కొన్నారు. ఆటలు గెలుపోటముల కోసమే కాకుండా స్నేహభావం, క్రమశిక్షణ, జట్టు భావాన్ని పెంపొందించుకునేందుకు కూడా దోహదపడతాయని అగారం ప్రకాష్ స్పష్టం చేశారు. మండల యువత అందరూ ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు.
