డ్రైనేజీ నరకయాత…
ఎమ్మెల్యే క్యాంప్ పక్కనే కాలనీవాసుల అవస్థలు
దుర్వాసన, దోమలతో ఆరోగ్యానికి ముప్పు
జడ్చర్ల రూరల్, జనవరి 6 (మన ఊరు ప్రతినిధి): పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం కుడి వైపున ఉన్న కాలనీలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ కాలనీవాసులకు నరకయాతగా మారింది. నెలల తరబడి డ్రైనేజీల శుభ్రత చేపట్టకపోవడంతో మురుగు నీరు నిలిచిపోయి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. డ్రైనేజీల పక్కనే నివసిస్తున్న కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. డ్రైనేజీ కాలువల్లో పేరుకుపోయిన చెత్తచెదారం తొలగించకపోవడంతో దోమల బెడద అధికమై, సీజనల్ వ్యాధులు వ్యాపించే ప్రమాదం పొంచి ఉందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మునిసిపల్ అధికారులు పట్టణ సమస్యలను తూతూమంత్రంగా పర్యవేక్షిస్తూ, పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ప్రజల అసహనం రోజురోజుకు పెరుగుతోంది. డ్రైనేజీల నుంచి తొలగించిన చెత్తను అక్కడికక్కడే రోడ్డుపై వేసేయడంతో రహదారులపై నడవలేని పరిస్థితి నెలకొంది. ఆయా మార్గాల గుండా వెళ్లే వారు ముక్కున వేలు వేసుకుని నడవాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రజాప్రతినిధులు, మునిసిపల్ అధికారులు స్పందించి తక్షణమే డ్రైనేజీల శుభ్రత చేపట్టి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.





