నాగర్‌కర్నూలులో ఈ నెల 30న ఉచిత కంటి చికిత్స, ఆపరేషన్ శిబిరం
నాగర్‌కర్నూల్, జనవరి 24 (మనఊరు ప్రతినిధి): జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా అంధత్వ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీ (శుక్రవారం) నాడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉచిత కంటి చికిత్స శిబిరం నిర్వహిస్తున్నట్లు నాగర్‌కర్నూలు ఆప్తాల్మిక్ అధికారి కొట్ర బాలాజీ తెలిపారు. ఈ కంటి శిబిరం నాగర్‌కర్నూలు జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ భవనం, గది నంబర్ 102 లో జరుగుతుందని ఆయన తెలిపారు. శిబిరానికి వచ్చే రోగులకు సాధారణ మరియు ప్రత్యేక కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షల్లో క్యాటరాక్ట్ (కంటి పొర) ఉన్నవారిని గుర్తించి, వారికి మహబూబ్‌నగర్ జిల్లా ఏనుగొండలోని లయన్ రామ్ రెడ్డి కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. అవసరమైన రోగులను ప్రత్యేక అంబులెన్స్ ద్వారా ఏనుగొండకు తరలించనున్నట్లు పేర్కొన్నారు. శిబిరానికి హాజరయ్యే రోగులు ముందుగా బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకొని వాటి నివేదికలను వెంట తీసుకురావాలని సూచించారు. అలాగే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు లేదా ఏదైనా గుర్తింపు కార్డు జిరాక్స్ కాపీతో పాటు ఫోన్ నంబర్ తీసుకురావాలని తెలిపారు. వివరాలకు 94408 76556, 73869 40480 నంబర్లను సంప్రదించాలని కోరారు.
