శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో 411 మంది చిన్నారులకు వైభవంగా అక్షరాభ్యాసం

 శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో 411 మంది చిన్నారులకు వైభవంగా అక్షరాభ్యాసం

నాగర్‌కర్నూల్, జనవరి 23 (మనఊరు):


శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయ 15వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు శుక్రవారం 411 మంది చిన్నారులకు వైభవంగా అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. వేదమూర్తులైన బ్రాహ్మణులు శాస్త్రోక్త విధానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు దేవాలయ చైర్మన్ ఆకారపు విశ్వనాథం తెలిపారు.

ఆలయ ప్రధాన అర్చకులు పి.నవీన్ కుమార్ శర్మ అర్చక బృందంతో కలిసి ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. మాఘ పంచమి అమ్మవారి జన్మదినమని, అదే రోజు వసంత పంచమిగా ప్రసిద్ధి చెందినదని ఆయన తెలిపారు. ఈ రోజున అమ్మవారిని పూజిస్తే జ్ఞానప్రాప్తి కలుగుతుందని, విజ్ఞానమే సర్వసంపదలకు మూలమని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా చిన్నారులు, విద్యార్థులు అమ్మవారిని దర్శించుకోగా, వారికి పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. పవన్ శర్మ, గోపాల్ శర్మలు గణపతి పూజ, నవగ్రహ పూజలతో పాటు అక్షరాభ్యాసం, అన్నప్రాశన కార్యక్రమాలను వేదమంత్రోచ్ఛారణలతో నిర్వహించారు.


దొడ్ల రాజవర్ధన్ రెడ్డి–రాధా దంపతులు నవగ్రహ హోమాన్ని నిర్వహించగా, జన్మ నిత్యా, గోచార రీత్యా గ్రహశాంతి కోసం ఈ హోమం చేసినట్లు తెలిపారు. జ్ఞాన సరస్వతి పారాయణ కమిటీ సభ్యులు లలితా సహస్రనామ పారాయణం, మణిద్వీప వర్ణన, లింగాష్టకం భక్తులతో కలిసి సామూహికంగా పఠించారు.

అలాగే జ్ఞాన సరస్వతి నిత్య అన్నదాన సత్రంలో వేలాది మంది భక్తులకు సామూహిక అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ప్రధాన కార్యదర్శి ఎలిమే ఈశ్వరయ్య, కమిటీ సభ్యులు వలిశెట్టి లక్ష్మీశేఖర్–ఇందుమతి, పాండురంగయ్య, బాలస్వామి,

 నారాయణ రెడ్డి, శారదమ్మ, శివశంకర్, ఈశ్వర్ రెడ్డి, రవికుమార్, భూపాల్ రెడ్డి, శివకుమార్, నవీన్ కుమార్‌తో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Previous Post Next Post