ప్రకృతి, యోగ జీవనశైలితోనే సంపూర్ణ ఆరోగ్యం
డాక్టర్. టి. ఉషారాణి
నాగర్‌కర్నూల్, జనవరి 23 (మనఊరు ప్రతినిధి):
ప్రతి ఒక్కరూ ప్రకృతిని ఆరాధిస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ టి. ఉషారాణి అన్నారు. తెలంగాణ ప్రభుత్వ యోగ అధ్యయన పరిషత్, ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో నిర్వహించిన వయోమిత్ర నేచురోపతి, యోగ అవగాహన శిబిరాన్ని ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిత్యజీవితంలో నడక, యోగ, పౌష్టికాహారం తప్పనిసరిగా ఉండాలని సూచించారు. సాధారణ చిరు వ్యాధులకు తరచుగా అల్లోపతి వైద్యం వినియోగించకూడదని, అయితే అత్యవసర పరిస్థితుల్లో మాత్రం తప్పనిసరిగా అల్లోపతి వైద్య సేవలు పొందాలని స్పష్టం చేశారు. ప్రకృతి వైద్యం, యోగ పద్ధతుల ద్వారా రోగాల నివారణకు మార్గాలు అనుసరించాలని, రోజూ పోషకాహారం తీసుకోవడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో న్యూట్రిషన్, మినరల్స్ ద్వారా చికిత్సలు చేయించుకోవడం మంచిదని సూచించారు.
ఈ కార్యక్రమంలో నేచురోపతి వైద్యులు డాక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జంక్ ఫుడ్ వినియోగం వల్ల అనేక రోగాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బయట పదార్థాలను తగ్గించి ప్రకృతి నుంచి లభించే చిరుధాన్యాలను ఆహారంగా వినియోగించాలని సూచించారు. నిత్యజీవితంలో ఏవైనా ఆరోగ్య సమస్యలు ఎదురైతే ప్రకృతి వైద్యులను సంప్రదించాలని తెలిపారు.
ఈ శిబిరంలో మొత్తం 228 మంది రోగులకు ప్రకృతి వైద్యం, ఆక్యుప్రెషర్ వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ వి. శేఖర్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సురేష్, డాక్టర్ శభాజు మాలిక్, డాక్టర్ శ్రీలత, ఆయుర్వేద ఫార్మసిస్ట్ మురళీకృష్ణ గౌడ్, యోగా శిక్షకులు శ్రీకాంత్ రెడ్డి, మహిళా శిక్షకులు అరుణమ్మ, జహంగీర్ బాబా, తదితరులు పాల్గొన్నారు.