ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి మార్చ్ టు పార్లమెంట్
ఫిబ్రవరి 5న ఢిల్లీలో ఎస్‌టీయూ ధర్నా
ఎస్‌టీయూ అసోసియేట్ రాష్ట్ర అధ్యక్షులు వడ్డే హనుమంతురెడ్డి
అమ్రాబాద్, జనవరి 7 (మనఊరు ప్రతినిధి): ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్‌టీయూ) ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5న ఢిల్లీలో మార్చ్ టు పార్లమెంట్ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎస్‌టీయూ అసోసియేట్ రాష్ట్ర అధ్యక్షుడు వడ్డే హనుమంతురెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీధర్ రావు నేతృత్వం వహించనున్నట్లు పేర్కొన్నారు. బుధవారం అమ్రాబాద్, పదర మండలాల పరిధిలోని వివిధ పాఠశాలలను సందర్శించిన ఎస్‌టీయూ నాయకులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. అనంతరం వంకేశ్వరం స్కూల్ కాంప్లెక్స్‌లో డైరీలు, క్యాలెండర్లను విడుదల చేస్తూ ఉపాధ్యాయ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు ప్రధానంగా ఈ డిమాండ్లు ప్రకటించారు. ఆగస్టు 2010కు ముందు నియామకమై ప్రస్తుతం సేవలో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరించాలి. పాఠశాలల విలీన ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలి. బోధనేతర పనుల నుంచి ఉపాధ్యాయులను పూర్తిగా విముక్తి చేయాలి. వెంటనే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలి. ఈ కార్యక్రమంలో అమ్రాబాద్, పదర మండలాల అధ్యక్ష, కార్యదర్శులు నరేందర్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, యాదమ్మ, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఎస్‌టీయూ నాయకులు హెచ్చరించారు.


