గ్రామ అభివృద్ధికి తొలి అడుగులు
వాగ్దానం నిలబెట్టుకున్న సర్పంచ్ హబీబా పసియోద్దీన్
భూత్పూర్, జనవరి 4 (మనఊరు ప్రతినిధి): సర్పంచిగా ఎన్నికైన అనంతరం గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానని సర్పంచ్ హబీబా పసియోద్దీన్ పేర్కొన్నారు. మండల పరిధిలోని తాటిపర్తి గ్రామంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అభివృద్ధి పనులు చేపట్టడం అభినందనీయమని గ్రామస్తులు ప్రశంసిస్తున్నారు. సర్పంచ్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం గ్రామంలోని అన్ని వార్డులను సందర్శించి, వార్డు సభ్యులను సమస్యలపై అడిగి తెలుసుకున్న హబీబా పసియోద్దీన్, ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా మారిన సమస్యలపై తక్షణమే స్పందించారు. ఒకటి, రెండు, మూడు వార్డుల్లో డ్రైనేజీపై ఉన్న వంతెన కూలిపోవడంతో కొంతకాలంగా వాహనదారులు, గ్రామ ప్రజలు తీవ్ర రాకపోకల సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని ప్రజలు ఆమె దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించి కూలిపోయిన వంతెనను పూర్తిగా తొలగించి, కొత్త వంతెనను నిర్మించారు. అదేవిధంగా రెండో వార్డులో వీధిదీపాల సమస్యను పరిశీలించి తక్షణమే ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని, ప్రజల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మద్ద రాఘవేందర్, వార్డు సభ్యులు లక్ష్మీనారాయణ, నరేందర్, మాజీ సర్పంచ్ ఆకుల వెంకటయ్య, గోపి, పెద్ద నరసయ్య, చిన్న నరసయ్య, బొక్కలి తిరుపతయ్య, మహమ్మద్ పటేల్, గొట్టే రాములు, బాలు, నరేష్, రామ్, సూర్య తదితరులు పాల్గొన్నారు.

