ఆకలితో ఎవరూ వెళ్లకూడదని ఉచిత అన్నప్రసాదం పంపిణీ
63వ వారానికి చేరుకున్న నవాబుపేట ఉచిత భోజన కార్యక్రమం
నవాబుపేట, జనవరి 4 (మనఊరుప్రతినిధి): ప్రజాసేవే తమ ప్రధాన లక్ష్యమని, ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగేందుకు కృషి చేస్తానని జెకె ట్రస్ట్ చైర్మన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు వి. నర్సింహచారి తెలిపారు. నవాబుపేట మండల కేంద్రంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న ఉచిత భోజన కార్యక్రమం ఈ ఆదివారం 67వ వారానికి చేరుకొని విజయవంతంగా కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆదివారం సంత (అంగడి) రోజున మండల కేంద్రానికి చుట్టుపక్కల గ్రామాలు, తండాల నుంచి దాదాపు 70 గ్రామాల ప్రజలు తరలివస్తారని చెప్పారు. వారిలో అనేక మంది పేద కుటుంబాలకు చెందినవారు ఆకలితో ఇబ్బందులు పడుతూ ఇంటికి వెళ్లే పరిస్థితులు తనను తీవ్రంగా కలచివేశాయని పేర్కొన్నారు. ఆకలితో ఒక్కరూ వెనుదిరిగి వెళ్లకూడదు అనే ఉద్దేశ్యంతో ఈ సేవా యజ్ఞానికి శ్రీకారం చుట్టాం. పదవి ఉన్నా లేకపోయినా ప్రజల మధ్య ఉండి సేవ చేయడమే నా లక్ష్యం అని నర్సింహచారి స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ఈ తరహా మానవీయ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని ఆయన వెల్లడించారు. పేదలు, కూలీలు, రైతులకు ఈ ఉచిత భోజన కార్యక్రమం ఎంతో ఉపశమనం కలిగిస్తోందని స్థానికులు అభినందిస్తూ, జెకె ట్రస్ట్ సేవలను ప్రశంసించారు.
.jpg)
