మార్చాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
మన ఊరు (కల్వకుర్తి ప్రతినిధి), జనవరి 26 : మండలంలోని మార్చాల గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయం, వివిధ యువజన సంఘాల కార్యాలయాలపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. గ్రామ పెద్దలు మాట్లాడుతూ ఈ స్వాతంత్ర్య సంబరం ఎందరో మహనీయుల త్యాగ ఫలితమని తెలిపారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహానుభావుల ఆత్మలకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. స్వాతంత్ర్య సమరయోధులు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఈ శుభ దినాన్ని స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను కొనసాగించేలా ముందడుగు వేయాలని పేర్కొన్నారు. దేశభక్తితో మన హృదయాలను నింపుకోవాల్సిన సమయం ఇదని, భారతదేశ ఘనమైన సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగిస్తూ ప్రపంచ దేశాలన్నింటికన్నా భారత్ మిన్నగా నిలవాలనేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఖాజమైనోద్దీన్, నామాని శ్రీను, మొహమ్మద్ షబ్బీర్, ప్రగతి యువజన సంఘం సభ్యులు యూసుఫ్ బాబా, ఆవ గణేష్, సాబేర్, మధు గౌడ్, నాకినామోని ప్రశాంత్, మహేష్, జహీర్, జహంగీర్, ఓర్స శివ, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.
