జ్ఞానసరస్వతి ఆలయంలో గాయత్రి నవగ్రహ హోమాలు

 గాయత్రి, నవగ్రహ హోమాలతో జ్ఞానసరస్వతి ఆలయం కళకళ

బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు

నాగర్ కర్నూల్, జనవరి 21 (మనఊరు ప్రతినిధి): జిల్లా కేంద్రంలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో జరుగుతున్న 15వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు గాయత్రి హోమం, నవగ్రహ హోమాలను వేదమూర్తులైన బ్రాహ్మణులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ విషయాన్ని దేవాలయ చైర్మన్ ఆకారపు విశ్వనాథం తెలిపారు. ఆలయ ప్రధాన అర్చకులు పి.నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ప్రవీణాచార్యులు, గోపాలాచార్యులు వేదమంత్రోచరణల మధ్య హోమాలను నిర్వహించారు. గాయత్రి అమ్మవారి పూజతో అష్టైశ్వర్యాలు, సర్వకార్యసిద్ధి లభిస్తుందని వేద పండితులు పేర్కొన్నారు. నాగర్‌కర్నూల్‌కు చెందిన పలువురు భక్త దంపతులు హోమాల్లో పాల్గొన్నారు. గణపతి పూజ, నవగ్రహ పూజలతో పాటు ప్రత్యేకంగా నవగ్రహ హోమాన్ని నిర్వహించారు. గీతాంజలి పాఠశాలతో పాటు ఇతర పాఠశాలల నుంచి వచ్చిన సుమారు 600 మంది విద్యార్థులు సామూహికంగా అమ్మవారికి అభిషేకాలు చేశారు. విద్యార్థులకు విద్యా ప్రాప్తి కలగాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. లలితా సహస్రనామ పారాయణం, మణిద్వీప వర్ణన, లింగాష్టకం భక్తులు సామూహికంగా పఠించారు. అమ్మవారికి పల్లకీ సేవను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం అన్నప్రసాదాన్ని భక్తులకు, విద్యార్థులకు పంపిణీ చేయగా, శ్రీశైలం వెళ్తున్న శివదీక్ష స్వాములకు ప్రత్యేకంగా అన్నప్రసాదం అందజేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం చండీ హోమం, దత్తాత్రేయ హోమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






Previous Post Next Post