పేపర్ ప్లేట్‌లో బ్యాంక్ ఖాతా వివరాలు!
వ్యక్తిగత డేటా భద్రతపై పెనుబుగ్గ
వ్యక్తిగత సమాచారం భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత జాగ్రత్తగా ఉండండి!
ఈ ప్రకటన సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది
రోడ్డుపక్కన తినుబండారాలు విక్రయించే చోట వినియోగిస్తున్న పేపర్ ప్లేట్‌లపై బ్యాంక్ ఖాతా వివరాలు ముద్రితమై ఉండటం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారానికి సంబంధించిన ఫొటోను ఓ వ్యక్తి ఎక్స్ (ట్విటర్) వేదికగా షేర్ చేయడంతో విషయం నెట్టింట వైరల్‌గా మారింది. ఆ ఫొటోలో పేపర్ ప్లేట్‌పై ఖాతాదారు పేరు, బ్యాంక్ పేరు, ఖాతా నంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ వంటి కీలక వివరాలు స్పష్టంగా కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా వాడి పారేసే ప్లేట్‌లపై ఇలా సున్నితమైన సమాచారం ఉండటంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన వ్యక్తిగత డేటా గోప్యతపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది. రీసైక్లింగ్ ప్రక్రియలో నిర్లక్ష్యం కారణంగా పాత బ్యాంక్ పత్రాలను ఇలా ఉపయోగించి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఇలాంటి నిర్లక్ష్యం వల్ల మోసాలు, ఆర్థిక నష్టాలు జరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బ్యాంక్ లేదా వ్యక్తిగత వివరాలు ఉన్న పత్రాలను వినియోగానికి ముందు పూర్తిగా నాశనం చేయాలని సైబర్ భద్రత నిపుణులు సూచిస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
