నూతన ల్యాబ్ టెక్నీషియన్లకు నియామక ఉత్తర్వులు పంపిణీ

 జిల్లాలో 15 మంది నూతన ల్యాబ్ టెక్నీషియన్లకు నియామక ఉత్తర్వులు

అన్ని పీహెచ్‌సీల్లో ల్యాబ్ సేవలు 

ప్రజారోగ్యానికి మరింత బలం

నాగర్ కర్నూల్, జనవరి 17 (మనఊరు ప్రతినిధి): జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో 15 మంది నూతన ల్యాబ్ టెక్నీషియన్లకు విధుల నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన నియామక పరీక్షలో ఎంపికైన ల్యాబ్ టెక్నీషియన్లు నాగర్ కర్నూల్ జిల్లాలో పనిచేయుటకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో హాజరై రిపోర్టు చేశారు. శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కే. రవికుమార్ నూతనంగా నియమితులైన ల్యాబ్ టెక్నీషియన్లకు వివిధ గ్రామీణ, గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విధులు నిర్వహించుటకు నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల్లో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు భర్తీ కావడం వల్ల మూత్ర, రక్త పరీక్షల సేవల్లో ఉన్న కొరత తీరిందని తెలిపారు. గ్రామీణ, ట్రైబల్ ప్రాంతాల్లో ల్యాబ్ టెక్నీషియన్ల నియామకంతో ప్రజలకు మెరుగైన వైద్య పరీక్షలు అందుబాటులోకి వస్తాయని, ప్రజారోగ్య సేవలు మరింత బలోపేతం అవుతాయని పేర్కొన్నారు. నూతనంగా ఎంపికైన ల్యాబ్ టెక్నీషియన్లు బాధ్యతాయుతంగా పనిచేసి ఈ ప్రాంత ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది భరత్ కుమార్, ల్యాబ్ టెక్నీషియన్ సంఘ జిల్లా అధ్యక్షులు పి. కళ్యాణ్, రేనయ్యా, నూతనంగా నియమితులైన ల్యాబ్ టెక్నీషియన్లు తదితరులు పాల్గొన్నారు.




Previous Post Next Post