క్షయరోగుల పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేక సర్వే

టీబీ రోగుల మందుల వినియోగంపై రాష్ట్ర తనిఖీలు చేసిన డబ్ల్యూహెచ్‌వో బృందం 

నాగర్‌కర్నూల్, జనవరి 23 (మనఊరు ప్రతినిధి):

నాగర్‌కర్నూలు జిల్లాలో క్షయ వ్యాధిగ్రస్తుల మందుల వినియోగం, వ్యాధి నయమైన వారి ఆరోగ్య పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సలహాదారు డాక్టర్ ఘన శుక్రవారం పర్యటించారు. సెంట్రల్ టీబీ డివిజన్ ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయి బృందంతో కలిసి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆయన పరిశీలనలు నిర్వహించారు.

ఈ సందర్భంగా క్షయ నిర్మూలన ప్రోగ్రాం రాష్ట్ర అధికారి డాక్టర్ రఫీక్‌తో కలిసి నాగర్‌కర్నూలు పట్టణంలోని ఈదమ్మ గుడి కాలనీలో నివసిస్తున్న క్షయ వ్యాధి నుంచి నయం అయిన రోగి కుటుంబ సభ్యులను కలిశారు. వారు మందులు వినియోగించిన విధానం, ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.


అనంతరం కల్వకుర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించిన బృందం, క్షయ వ్యాధిగ్రస్తులు మరియు వారి కుటుంబ సభ్యుల నుంచి సంబంధిత ఆధారాలు సేకరించింది. ఈ సందర్భంగా డాక్టర్ ఘన మందులు వినియోగిస్తున్న రోగులకు, అలాగే పూర్తిగా నయం అయిన వారికి తగిన సూచనలు, సలహాలు అందించారు. ప్రతి క్షయ రోగి పూర్తి కాలం చికిత్స తీసుకోవడం ఎంతో కీలకమని ఆయన సూచించారు.

వ్యాధిగ్రస్తులకు సంబంధించిన అన్ని రిపోర్టులు, మందుల వినియోగ వివరాలను తప్పనిసరిగా నిక్షయ్ పోర్టల్‌లో నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో టీబీ ట్రీట్మెంట్ ఆఫీసర్ మిన్హాజ్, టీబీ సూపర్వైజర్లు శ్రీనివాసులు, ఆరిఫ్ ఖాన్, హెల్త్ అసిస్టెంట్ మేషక్ తదితరులు పాల్గొన్నారు.

Previous Post Next Post