ఆకుకూరల ధరలు కుప్పకూలి.. రైతుల ఆవేదన

 ఆకుకూరల ధరలు కుప్పకూలి.. 

రైతుల ఆవేదన

బాలానగర్, జనవరి 30 (మనఊరు ప్రతినిధి): పడిపోయిన ఆకుకూరల ధరలతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాలానగర్ మండల కేంద్రంలో ప్రతి శుక్రవారం నిర్వహించే వారాంతపు సంత గత 30 సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఈ సంతకు బాలానగర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు, కూరగాయల వ్యాపారులు తమ ఉత్పత్తులను విక్రయానికి తీసుకొస్తుంటారు. అయితే గత వారం రోజులుగా మార్కెట్లో ఆకుకూరలు భారీ ఎత్తున సంతకు రావడంతో ఒక్కసారిగా ధరలు పడిపోయాయి. శుక్రవారం జరిగిన సంతలో ఆకుకూరలు పెద్ద మొత్తంలో విక్రయానికి తీసుకురావడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. గతవారం వరకు కొత్తిమీర పెద్ద కట్ట రూ.20కి విక్రయించగా, ఈ శుక్రవారం కేవలం రూ.5కే పడిపోయింది. అలాగే మెంతికూర కట్ట రూ.5, పాలకూర కట్ట రూ.5కే పరిమితమైంది. దీంతో ఆకుకూరలు సాగు చేస్తున్న రైతులకు గిట్టుబాటు కావడం లేదని, పెట్టుబడులు కూడా రాక తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నామని వారు వాపోతున్నారు. నిలకడలేని మార్కెట్ ధరల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, కూరగాయలు ముఖ్యంగా ఆకుకూరల ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మండల కేంద్రంలో కోల్డ్ స్టోరేజ్ (కోల్డ్ స్టేజీ) ఏర్పాటు చేస్తే కొంతవరకు నష్టాలను నివారించవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.


సంతలో ఆకుకూరలు విక్రయిస్తున్న రైతులు

Previous Post Next Post