చివరి రోజున నామినేషన్ల జోరు

 చివరి రోజున నామినేషన్ల జోరు

కల్వకుర్తి, ఆమనగల్ మున్సిపాలిటీల్లో పోటీపడుతున్న అభ్యర్థులు

కల్వకుర్తి, జనవరి 30 (మనఊరు ప్రతినిధి): మూడవ రోజు శుక్రవారం నామినేషన్లకు చివరి రోజు కావడంతో కల్వకుర్తి, ఆమనగల్ మున్సిపాలిటీల్లో నామినేషన్ల జోరు కనిపించింది. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. కల్వకుర్తి మున్సిపాలిటీలో 22 వార్డులకు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిన్నటి వరకు మొత్తం 72 నామినేషన్లు దాఖలయ్యాయి. నేడు చివరి రోజు కావడంతో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయడానికి పోటీ పడ్డారు. అదే విధంగా ఆమనగల్ మున్సిపాలిటీలో 15 వార్డులకు జరుగుతున్న ఎన్నికలలో మూడవ రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. నిన్నటి వరకు 41 నామినేషన్లు దాఖలుకాగా, చివరి రోజు కావడంతో వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు సమర్పించారు. ఆమనగల్ మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థిగా బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడు తల్లోజ్ ఆచారీ సతీమణి గీత 3వ వార్డు నుంచి నామినేషన్ దాఖలు చేశారు. కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున బలపరిచిన రత్నమాల నామినేషన్ దాఖలు చేయగా, ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల అభ్యర్థులు తమకు ఓటు వేసి గెలిపిస్తే, తమ తమ వార్డుల్లోని సమస్యలను పరిష్కరిస్తామని ప్రజలకు హామీలు ఇచ్చారు.






Previous Post Next Post